Telangana News: ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం- దసరా బోనస్‌పై కేటీఆర్
Telangana Singareni Bonus | తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్ లో అన్యాయం చేసిందని, సగం మొత్తమే ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR Comments on Bonus for Singareni Workers | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల దసరా బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికుల ప్రయోజనం కోసం బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్ కాదని, బోగస్ అని సంస్థ లాభాల్లో 20 శాతం మాత్రమే పంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో 20 శాతం లాభాలు మించలేదు
హైదరాబాద్‌లో ఆదివారం నాడు (సెప్టెంబర్ 22న) నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థ ఎన్నో విజయాలు సాధించిందని, ఎన్నో మైలురాళ్లు చేరుకుందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని కేటీఆర్ చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సింగరేణిలో రూ.1,060 కోట్లు లాభాలు వచ్చాయి. ఆ ఏడాది అంటే 2014-15లో రూ.102 కోట్లకు పైగా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇచ్చాం. అనంతరం సంస్థ మరింత అభివృద్ధి చెందగా.. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. ఆ ఏడాది ఒక్కో సింగరేణి కార్మికుడికి 1 లక్ష చొప్పున బోనస్ అందించాం.
రూ.17 వేల నుంచి రూ.1.60 లక్షలకు పెంచామన్న కేటీఆర్
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.17 వేలు ఇస్తే.. పదేళ్లలో లాభాలు పెంచుతూ పోయి 2023 నాటికి ఒక్కో కార్మికుడికి 1.60 లక్షలు దసరా బోనస్ ఇచ్చాం. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్ కాదు, అంతా బోగస్‌లా కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి దసరా బోనస్ ప్రకారం సింగరేణి ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు వస్తాయి. దాంతో వారికి రూ.1.80 నష్టం కలగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో రూ.4,701కోట్ల లాభాలు వచ్చాయన్నారు. అందులో 33 శాతం వాటా కార్మికులకు ప్రకటించారు. అంటే రూ.1,551కోట్లను కార్మికులకు పంచాలి. ఆ లెక్కన చూస్తే ఒక్కో కార్మికుడికి రూ.3.70లక్షలు దసరా బోనస్ రావాలి. కానీ ప్రభుత్వం లక్షా తొంబై వేలు మాత్రమే బోనస్‌గా ప్రకటించింది.
ప్రభుత్వం పంచింది కేవలం 16.2 శాతం లాభాల్లో వాటా, కాగా 33 శాతం లాభాలను కార్మికులను పంచామంటూ మభ్యపెడుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే కార్మికులను చేసే న్యాయం ఇదేనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా అడుగులే వేస్తోంది. అందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం కార్మికులకు అండగా నిలిచి సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని’ కేటీఆర్ స్పష్టం చేశారు.