కేసీఆర్ స్పీడుని తట్టుకోలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు: బీఆర్ఎస్ నేతలు ఫైర్
తెలంగాణలో సీఎం కేసీఆర్ స్పీడును తట్టుకోలేక, దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
రాష్ట్రం లో ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గండ్ర, వివేకానంద మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
TSPSCలో అనేక మార్పులు తెచ్చాం. ఇద్దరు ఇంటి దొంగల వల్ల పేపర్లు లీక్ అయ్యాయి. మొత్తం వ్యవస్థనే అవమాన పరిచేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. జంబ్లింగ్ విధానం లో పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు రూపొందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. నిరుద్యోగులు మనో స్థైర్యాన్ని కోల్పోవద్దు. పరీక్ష రాసే వారెవ్వరికీ నష్టం వాటిల్లకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లీకేజీలు గుర్తించింది పబ్లిక్ సర్వీస్ కమీషన్ తప్ప, ప్రతిపక్షాలు కాదు. చదువు రాని ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. చదువుకున్న BSP నేత ప్రవీణ్ కుమార్ కూడా వారి లాగే మాట్లాడటం దురదృష్టకరం. ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి గా ఉన్నపుడు మా ప్రజాప్రత్రినిధులు ఉద్యోగాల కోసం రికమెండ్ చేశారా లేదా చెప్పాలి. రాజకీయాల కోసం నిజాయితీగల TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని విమర్శించడం ప్రవీణ్‌కు తగదు. ఏవైనా సలహాలుంటే ఇవ్వాలి. అంతేకానీ బురద జల్లకూడదు. పరీక్ష రాసేవారు ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం తో రాయాలి. జోనల్ విధానంతో 90 శాతానికి పైగా ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉన్నారు. సిట్ విచారణను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సరికాదు. సిట్ విచారణతో నిజానిజాలు బయటకు వస్తాయి.
గుజరాత్‌లో పరీక్షపేపర్ల లీకేజీ సర్వసాధారణం- ఎమ్మెల్యే వివేకానంద
పేపర్ లీకేజీ ఘటనపై ప్రతిపక్షాల తీరు సరిగా లేదు. KTRకు వస్తున్న జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును ఓర్చుకోలేక బండి సంజయ్ పిచ్చి విమర్శలు చేస్తున్నారు. KTRను మంత్రివర్గం నుంచి తప్పించాలని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పేపర్ లీకేజీ ఘటన తర్వాత 46 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడి సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారా? మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో పరీక్షల లీకేజీ సర్వసాధారణం. మోదీ ఎపుడైనా రాజీనామా చేశారా? రాజస్తాన్‌లో 13 సార్లు పేపర్లు లీకయ్యాయి. అక్కడి సీఎం రాజీనామా చేశారా? ముందు వారిని రాజీనామా చేయించి బండి సంజయ్ ఇక్కడ మాట్లాడాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి పేపర్ లీకులో బీజేపీ నేతల ప్రమేయం ఉంది. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. KTRను అప్రతిష్ట పాలుచేసేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారు బండి సంజయ్ ఓ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే కుట్రలు చేస్తోంది. సిరిసిల్లలో నవీన్ అనే యువకుడు ఆత్మహత్య వేరే కారణాలతో చేసుకుంటే, బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి దుష్ప్రచారం చేశారు. స్వయంగా నవీన్ తండ్రి తన కుమారుడి మృతిని రాజకీయం చేయొద్దని వేడుకున్నారు. ఇప్పటికైనా నవీన్ మృతి పై అబద్దాలు ప్రచారం చేసిన నేతలు క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానకపోతే లీగల్ నోటీసులు ఇస్తాం.
బండి, రేవంత్ గోబెల్స్ వారసులు: ఎమ్మెల్యే గండ్ర
పేపర్ లీకేజీ ఘటనపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి గోబెల్స్ కు వారసుల్లా మాట్లాడుతున్నారు. TSPSC స్వతంత్ర సంస్థ.పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్‌కు ఏమిటి సంబంధం? KTR పీఏకు కూడా ఇందులో పాత్ర ఉందనడం బాధ్యతా రాహిత్యం. KTR పీఏ స్వగ్రామంలో పదిమంది గ్రూప్ వన్ రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. వందమంది అక్కడ గ్రూప్ వన్ కు ఎంపికయ్యారని దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్ బీజెపి బట్టకాల్చి మీద వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఆయన కూడా నీతులు చెబుతున్నారు. సిరిసిల్ల నవీన్ ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాల నిజస్వరూపం బట్టబయలైంది. ఉద్యోగాల నియామకం జరిగితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని ప్రతిపక్షాలు నియమాకాలు ఆపే కుట్ర చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. కవిత ఈడ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ స్పీడ్‌ని ఆపలేరు.