Bhatti Vikramarka: భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు - భట్టి విక్రమార్క
Gandhian Ideology Centre in Hyderabad: కాంగ్రెస్ నేతలు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇది చరిత్రలో లిఖించదగ్గ రోజు అన్నారు.
Bhatti Vikramarka at Gandhian Ideology Centre in Hyderabad: హైదరాబాద్: బోయినపల్లి గాంధీ ఆడిటోరియంలో జరగనున్న ఈ సమావేశం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లారు. దేశం వనరులు, సంపద అందరికీ సమానంగా అందుబాటులోకి తెచ్చేందుకు కుల గణన జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ విశ్వసించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రాహుల్ గాంధీ అనాడే చెప్పారని.. అందుకే రాష్ట్రం నుంచే కుల గణన (Caste Census) ప్రారంభిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఎన్నికల సభల్లో ప్రకటించారని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. కుల గణన విషయంలో దేశానికి దశా దిశ చూపడానికి, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర క్యాబినెట్ ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు
కుల గణనపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని జీవోగా మార్చి.. కచ్చితమైన ప్రణాళికా శాఖ ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టామన్నారు. కుల గణన సర్వే (Telangana Family Survey)లో సమాజంలోని అన్ని వర్గాలను పొందుపరచాలి. వారిని ఏ ప్రశ్నలు అడగాలి, ఈ సమాచారం సేకరించాలనే అంశాలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. తెలంగాణ సమాజంలోని మేధావులు, సామాజికవేత్తలతో సంప్రదింపులు రాహుల్ గాంధీ చర్చలు జరుపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.
కుల గణన అంశంపై గాంధీభవన్లో (Gandhi Bhavan) ఇప్పటికే కీలక నేతలతో సమావేశమై చర్చలు జరిపాము, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలు సమావేశమై సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని మేధావులను పిలిచి వారి సలహాలు సూచనలు తీసుకున్నాం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆలోచనలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన సర్వేలో ప్రశ్నలు తయారుచేసి, సమగ్ర సమాచారం సేకరిస్తామన్నారు.
హైదరాబాద్ కు రాహుల్ గాంధీ
తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీలో బయలుదేరి, బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ మేధావులు, బీసీ సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే, కులగణన సర్వేపై వారి అభిప్రాయాలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారు.