Hyderabad FormulaE: హైదరాబాద్‌లో మధ్యలోనే నిలిచిన ఇండియా రేసింగ్ లీగ్ - నిరాశగా వెనుదిరిగిన అభిమానులు !
నిన్న టెస్ట్ రేస్‌లు నిర్వహించగా.. ఆదివారం సమయాభావం, వరుస ప్రమాదాలు జరగడం, లీగ్ రేసర్లకు స్వల్ప ప్రమాదాల కారణంగా పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయింది.
హైదరాబాద్ లో మొదటి రేసింగ్ లీగ్ ఆటంకాల మయం..!
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే విమర్శలను కూడగట్టుకుంది. నిన్న టెస్ట్ రేస్‌లు నిర్వహించగా.. ఆదివారం సమయాభావం, వరుస ప్రమాదాలు జరగడం, లీగ్ రేసర్లకు స్వల్ప ప్రమాదాల కారణంగా పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయింది. క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై పలుమార్లు కార్లు ఢీ కొన్నాయి. ఇదే విషయం పై వివరణ కోరగా షెడ్యూల్ ఇంతే ముగిసిందని నిర్వాహకులు చెబుతున్నారు. క్వాలిఫయింగ్ రేస్ లో ప్రమాదాలతో కొన్ని గంటల సమయం వృథా కాగా, మెయిన్ రేస్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఉదయం నుంచి జేకే టైర్స్ ఆధ్వర్యంలో ఫార్ములా 4 రేస్ క్వాలిఫయింగ్ రేస్ మాత్రమే సాధ్యమైంది. దీంతో ఇండియా రేసింగ్ లీగ్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వరుస ప్రమాదాలతో మొదలుకాని మెయిన్ రేస్ !
నిన్న టెస్ట్ రేస్‌లు నిర్వహించగా.. ఇవాళ ఉదయం నుంచి ఐదు వరకు చిన్న ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఓ మహిళా రేసర్ గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమయాభావం కారణంగా పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయారు. ఉదయం 9గంటల నుంచి జేకే టైర్స్ ఆధ్వర్యంలో ఫార్ములా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై రేసింగ్ కార్లు ఢీకొనడం, ఓ కారుపై చెట్టు కొమ్మ పడింది. మరో రేసింగ్ కార్ లైన్ పక్కన ఉన్న ఫెన్సింగ్ కు తాకడంతో స్వల్ప ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా దేశంలో తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనుంది.
స్వల్ఫ ప్రమాదాల వల్ల క్వాలిఫయింగ్ రేస్ ఆలస్యం కాగా, ప్రధాన రేసింగ్ పూర్తిగా జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేసింగ్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటం, ప్రమాదాలతో నిర్వహణ ఆలస్యం కావడంతో చీకటి పడిందన్న కారణాలతో ఇండియా రేసింగ్ లీగ్ ను నిలిపివేశారు. నేటితో షెడ్యూల్ ముగియడంతో రేపు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఫార్మూలా-4 రేసు ట్రయల్స్ తోనే నిర్వాహకులు సరిపెట్టడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. వీఐపీ టికెట్ తీసుకున్నప్పటికీ లోపలకు అనుమతించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. రేసింగ్‌లో ఇవాళ ఉదయం నుంచి ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రేసులో నెల్లూరుకు చెందిన విశ్వాస్ అనే రేసర్ ఓ రౌండ్ లో తొలి స్థానంలో నిలిచి సత్తాచాటాడని సమాచారం.
క్వాలిఫైయింగ్ రేస్ లో చెన్నై టర్బో రేసర్ కి స్వల్ప గాయాలయ్యాయి. రెండు రేసింగ్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ మర్గ్ లో జరిగిన ఈ ప్రమాదంలో చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసర్ కు స్వల్పగాయాలయ్యాయి. మహిళ రేసర్ కు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్వాలిఫైయింగ్ రేస్ లో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రేస్ లో ఇలాంటి చిన్న చిన్న క్రాసింగ్స్ ప్రమాదాలు సహజం అంటున్నారు నిర్వహకులు.