Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రోకు మరో గుర్తింపు, మూడు స్టేషన్లకు ఐజీబీసీ రేటింగ్
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో మరో అరుదైన ఘనత పొందింది. నగరంలో మరో మూడు మెట్రోస్టేషన్లు ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేషన్ పొందాయి.
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రోకు మరో ఘనత దక్కింది. నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ గ్రీన్ ఎంఆర్టీఎస్ సర్టిఫికేషన్ లభించింది. దుర్గం చెరువు, పంజాగుట్ట, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ తో హైదరాబాద్ మెట్రో రైలుకు చెందిన 23 స్టేషన్లు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ పొందాయి. నగరంలో ప్రజారవాణాలో అగ్రగామిగా నిలుస్తున్న ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) గ్రీన్ ఎంఆర్టీఎస్ సర్టిఫికేషన్ ప్లాటినమ్ రేటింగ్ పొందింది. ఎలివేటెడ్ స్టేషన్ల విభాగంలో తాజాగా దుర్గంచెరువు, పంజాగుట్ట, ఎల్బీనగర్ స్టేషన్లు గుర్తింపు పొందాయి. ఈ ర్యాంకింగ్‌తో మెట్రో రైల్‌కు చెందిన 23 స్టేషన్లు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ పొందినట్లు అయింది. ఈ మేరకు హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఐజీబీసీ నుంచి ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి ప్లాటినమ్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
ఎల్ అండి టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ... మరో మూడు మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ దక్కడం ఆనందంగా ఉందన్నారు. మెట్రో స్టేషన్లను రెగ్యులర్ గా ఆడిటింగ్ చేయడంతో పాటుగా గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తు్న్నామన్నారు. ఇటీవలే హైదరాబాద్ ప్రపంచ హరిత నగరంగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు.
L&T #HyderabadMetro Rail has been awarded @IGBConline #GreenMRTSCertification with the highest #PlatinumRating under Elevated Stations Category for its 3 additional metro stations - #DurgamCheruvu, #Punjagutta and #LBNagar.@TelanganaCMO @md_hmrl @hmrgov @KTRTRS pic.twitter.com/5hHwGKelSF
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) October 21, 2022
హైదరాబాద్ కు అరుదైన అవార్డు
హైదరాబాద్‌కు ఇటీవల అరుదైన ఘనత లభించింది. ప్రపంచ హరిత నగరాల అవార్డులు 2022లో హైదరాబాద్‌కు కీలక అవార్డు లభించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హరిత హారాన్ని ఏర్పాటు చేసినందున పురస్కారం లభించింది. లివింగ్ గ్రీన్ కేటగిరీ కింద ఈ అవార్డు దక్కింది. కొరియాలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్లనే ఇది సాధ్యమయిందని ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రకటించారు.
హైదరాబాద్‌కు గ్రీన్ అవార్డులు రావడం ఇదే మొదటి సారి కాదు. గత రెండేళ్లుగా ట్రీ సిటీ పురస్కారాలను హైదరాబాద్ అందుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్ వివరాలతోపాటు పలు కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో చేపట్టిన హరితహారం కారణంగా ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2021’గా ప్రకటిస్తున్నట్టు ఎఫ్‌ఏవో, అర్బన్ డే ఫౌండేషన్ గతంలో వెల్లడించాయి. అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో హైదరాబాద్ ప్రపంచంలోని పలు నగరాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతినిధులు ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, మినీ అడవుల ఏర్పాటుతో హైదరాబాద్‌ను అత్యంత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దారని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి.