Allu Arjun News: అల్లు అర్జున్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు, ఆయనే వచ్చి పోలీసు వాహనం ఎక్కారు: సెంట్రల్ జోన్ డీసీపీ
Hyderabad News | నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
Police Explains Pushpa 2 Actor Allu Arjun Arrest Process | అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నాడు: సెంట్రల్ జోన్ డీసీపీ
హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీసీ తెలిపారు. పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకోగా, దుస్తులు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని పుష్ప 2 నటుడు కోరారు. అతను తన బెడ్రూమ్ లోకి వెళ్లాడు. ఆ సమయంలో పోలీసు సిబ్బంది బయట వేచి ఉన్నారు. అల్లు అర్జున్ బయటకు రాగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీసు సిబ్బంది కూడా అల్లు అర్జున్‌తో గానీ, ఆయన కుటుంబసభ్యులతో గానీ ఏ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. తన భార్యతో, కుటుంబసభ్యులతో అల్లు అర్జున్ సంభాషించడానికి అతనికి తగినంత సమయం ఇచ్చాం. అనంతరం అల్లు అర్జున్ స్వయంగా బయటకు వచ్చి పోలీసు వాహనం ఎక్కాడని సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించారు.
సంధ్య థియేటర్ నుంచి లేఖ వచ్చింది, కానీ
పుష్ప-2 సినిమా విడుదలకు సంబంధించి 04/05-12-2024 తేదీన సంధ్యా సినీ ఎంటర్‌ప్రైజ్ 70 MM వారు బందోబస్తును కోరుతూ చిక్కడపల్లి ఏసీపీకి లేఖ పంపారు. సాధారణంగా కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలు, మొదలైన కార్యక్రమాలలో బందోబస్తు కోసం మాకు చాలా అభ్యర్థనలు అందుతాయి. ప్రతి ఈవెంట్‌కు బందోబస్తును అందించడం మా వనరులకు మించి అవుతుంది. కనుక భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్న, కొంత మంది ప్రముఖలు సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లో, ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ / ACP / DCP కార్యాలయాన్ని సందర్శించాలి. పోలీసులను కలిసి వివరాలు తెలియజేస్తే, వివరాల ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం.
అధికారులను కలిసి ప్రత్యేకంగా కోరలేదు
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఏ థియేటర్ నిర్వాహకుడు ఏ అధికారిని కలువలేదు. కేవలం ఇన్‌వర్డ్ విభాగంలో మాత్రమే లేఖను సమర్పించారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం తగిన బందోబస్త్ ఏర్పాటు చేసినా.. పోలీసులకు ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. నటుడు అల్లు అర్జున్ వచ్చే వరకు జనం బాగా అదుపులో ఉన్నారు. సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన ఆయన తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమికూడిన ప్రజలకు చేతులు ఊపడం ప్రారంభించారు. సంధ్య థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలా మంది ప్రజలు ఆకర్షితులై అటువైపు ఎక్కువ మంది వెళ్ళారు.
అదే సమయంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించడానికి ప్రజలను నెట్టడం ప్రారంభించారు. ఈ పెద్ద సమూహమును గమనించి అతనిని వెనక్కి తీసుకువెళ్లాలని అతని టీమ్‌కు తెలియజేశారు. కానీ వారు దానిపై చర్య తీసుకోలేదు, అల్లు అర్జున్ 2 గంటలకు పైగా థియేటర్‌లోనే ఉన్నాడు. అందువల్ల, తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం, అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయని స్పష్టమైంది. ఇందులో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత కూడా వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్నాడు అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వివరించారు.