Weather Latest Update: అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఎల్లో అలర్ట్ జారీ
Hyderabad Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Rains Alert To Ap And Telangana: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. యానం, ఆంధ్రప్రదేశ్ లలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్రేయ దిశగా గాలులు వీచనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 12 నుంచి 15, 16 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అది వాయుగుండంగా మారే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుంది. ఏపీలో సోమవారం వరకు తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోనూ వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అనంతపురంలో చినుకులు పడతాయని, మోస్తరు వర్షాలు లేకపోవడంతో కొన్నిచోట్ల ఉక్కపోత సమస్య సైతం తలెత్తనుంది.
District forecast of Andhra Pradesh dated 11-10-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/gcDdmkU7SI
— MC Amaravati (@AmaravatiMc) October 11, 2024
తెలంగాణలో వర్షాలతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో పలు జిల్లాల్లో శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం, సోమవారం వరకు వర్షాలు కురవనున్న జిల్లాల వివరాలను వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్టోబర్ 12, 13 తేదీలలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందిని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Zone-wise forecast for Hyderabad city dated: 11.10.2024@GHMCOnline @HYDTP pic.twitter.com/q8lVHUmF2g
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 11, 2024
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ఏరియాల్లో చినుకులు పడతాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదైంది. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.