దళిత బంధుపై పుకార్లు నమ్మవద్దు.. అర్హులందరికీ ఇస్తాం.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడి
దళిత బంధుపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని.. అర్హులందరికీ సాయం అందుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా దళిత బంధును హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
దళిత బంధు కార్యక్రమంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని.. అర్హులందరికీ సాయం అందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు, ఇతర సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరి చెప్పుడు మాటలు వినవద్దని.. హుజురాబాద్‍లోని ప్రతి కుటుంబానికి దళితబంధు అందిస్తామని స్పష్టం చేశారు.
దళిత బంధును పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్లుండి (ఆగస్టు 16) ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులను అందజేయనున్నట్లు చెప్పారు. దళిత బంధు అమలుకు రూ.2000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీని వల్ల 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.
Also Read: Karimnagar: హుజూరాబాద్‌లో దళితబంధు చెక్కులు తొలుత 15 మందికే.. ఆ తర్వాత మిగతావారికి.. సీఎస్ వెల్లడి
అనవసర ఆరోపణలు..
ఎన్నికలప్పుడే దళిత బంధు తెచ్చారని.. దీని ఫలాలు కొందరికే అందుతాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను హరీశ్ ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని.. దళిత బంధు పథకాన్ని మార్చిలోనే ప్రకటించామని, ఆర్థిక మంత్రిగా తానే ఈ పథకం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. దళిత బంధు సాయాన్ని ప్రతి ఒక్కరికీ అందిస్తామని స్పష్టం చేశారు. ఇదే నియోజకవర్గంలో రైతు బంధు ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు.. ఇప్పుడు దళిత బంధు ప్రారంభిస్తుంటే తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు.
అంత ప్రేమ ఉంటే డబ్బులు ఇప్పించండి..
దళిత బంధు కింద రూ.50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ అంటున్నారని.. తమకు చేతనైనంత మేర రూ.10 లక్షలు సాయం చేస్తున్నామని హరీశ్ చెప్పారు. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే కేంద్రాన్ని అడిగి మరో రూ.40 లక్షలు తీసుకురావాలని బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం తెస్తే పాలాభిషేకం చేస్తామని అన్నారు.
దళిత బంధు ఎంపిక ఇలా..
దళిత బంధు సాయం అందించేందుకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిని నియమించామని హరీశ్ తెలిపారు. ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు.
దళిత బంధు అడ్డుకోవాలని కుట్రలు..
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుపుతున్నారని హరీశ్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దళిత బంధు ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాలు రాస్తున్నారని, హైకోర్టులో కేసులు వేస్తున్నారని ప్రస్తావించారు. దళిత జాతి మొత్తం ఈ వ్యవహారాన్ని గమనిస్తోందని, దీని వెనుక ఎవరున్నారనేది ప్రజలు తెలుసుకోగలరని అన్నారు. 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు లక్ష్మణ్ రావుకు హరీశ్ సంతాపం తెలిపారు. లక్ష్మణ్ రావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
Also Read: TRS Party News: కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఏమైంది? అక్కడ ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు..?