TRS Party News: కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఏమైంది? అక్కడ ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు..?
కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 10 రోజుల క్రితమే కేబినెట్ ఆమోదం పొందించిన దస్త్రం ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వెంటనే హుజూరాబాద్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వివిధ వర్గాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్‌లో చేరి కొద్ది రోజులు కాకుండానే తన రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టారంటూ విపక్షనేతలు విమర్శించారు. అసలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలంటే.. ఆ వ్యక్తి ఏదైనా రంగంలో ప్రతిభావంతులు లేదా నిష్ణాతులు అయి ఉండాలనే నిబంధన కూడా పాటించలేదనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామం ఆసక్తికరంగా మారింది.
Also Read: Revant Vs Komatireddy : రేవంత్‌పై కోమటిరెడ్డిదే పైచేయి.. టీ కాంగ్రెస్ ఆధిపత్య పోరాటంలో కొత్త కోణం..!
గోరెటి వెంకన్నకు వెంటనే ఆమోదం
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా మంత్రిమండలి ఖరారు చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే సంబంధిత దస్త్రం గవర్నర్ వద్దకు వెళ్లి 10 రోజులకుపైగా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తమిళిసై ఈ ఫైలును పక్కన పెట్టేశారా? అనే అనుమానం తలెత్తుతోంది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గోరెటి వెంకన్నను నియమించిన సందర్భంలో ఆ ఫైలును గవర్నర్ చిటికెలో ఆమోదించారు. కానీ, ఇప్పుడు కౌషిక్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. పది రోజులు దాటినా ఆ ఫైలు ఇంకా తిరిగి రాలేదు. దీంతో అసలు ఈ ఫైలు వస్తుందా రాదా అనే ఆందోళనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
రాజకీయ నిరుద్యోగుల భర్తీ కోసం!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లలో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నవారినే ఎంపిక చేయాలనే సాంప్రదాయం ఎప్పుడో పక్కన పెట్టారన్నది పైకి కనిపిస్తున్న వాస్తవమే. ఆ సీట్లను రాజకీయ నిరుద్యోగులకు సర్దుబాటు ఎప్పటి నుంచో మొదలైన ముచ్చట. ఇలానే కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేటెడ్ అయిపోయారు. ఇలా సిఫారసు చేయటంపై తీవ్ర స్థాయిలో విమర్శలతోపాటు గవర్నర్‌కు ఫిర్యాదులు కూడా అందాయి.
ఇంత వరకు కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్‌పై గవర్నర్ సంతకం చేయలేదు. అభ్యంతరం కూడా చెప్పలేదు. అభ్యంతరం చెప్పి ఈ ఫైలును గవర్నర్ ఒకసారి తిప్పి పంపిస్తే... మళ్లీ కేబినెట్ ఆమోదంతో రెండోసారి సంతకానికి వెళ్తే మాత్రం కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఫైలుపై నిర్ణయం తీసుకోకుండా ఎంత కాలమైనా ఉంచొచ్చు. ఇప్పుడు గవర్నర్ చేస్తుంది ఇదేనంటూ ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.
మహారాష్ట్రలో 8 నెలలుగా..
తెలంగాణలో ఇలా ఉంటే మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర కేబినెట్ 12 మంది వ్యక్తులను కౌన్సిల్‌కు నామినేట్ చేస్తూ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ఇది జరిగి 8 నెలలు దాటుతోంది. కానీ ఆ దస్త్రం ఇంత వరకూ తిరిగి లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈ అంశంపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని బట్టి గవర్నర్ ఇలాంటి సందర్భంలో నిర్ణయం తీసుకోవటానికి నిర్దిష్ట సమయం అని ఏం లేదని అర్థమవుతోంది.
Also Read: TS Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్‌కు ముహూర్తం.. వైద్య, ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్! కానీ..
సరిగ్గా అలాగే తెలంగాణ గవర్నర్ కూడా ఈ ఫైలును పక్కన పెట్టేసినట్లే అవగతం అవుతోందని విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీ హూజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటా కింద నామినేట్ చేయటాన్ని కారణంగా చూపి ఆలస్యం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, గవర్నర్ల నిర్ణయాల వెనక కూడా రాజకీయ కోణాలు ఉంటున్న విషయాలు గతంలో వెలుగుచూశాయి. ఏపీలో కూడా ఇటీవలే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల విషయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేతలనే అక్కడి గవర్నర్ ఆమోదించారు. తెలంగాణ విషయంలో గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా? ఆమోదించి పంపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Kishan Reddy Yatra: ఈ నెల 19 నుంచి 21 వరకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర..