Revant Vs Komatireddy : రేవంత్‌పై కోమటిరెడ్డిదే పైచేయి.. టీ కాంగ్రెస్ ఆధిపత్య పోరాటంలో కొత్త కోణం..!
ఇంద్రవెల్లి తర్వాత ఇబ్రహీంపట్నంలో " దళిత, గిరిజన దండోరా " సభ పెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తాను హాజరు కాబోనని చెప్పడంతో వేదిక మార్చారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో చేపట్టాలనుకున్న " దళిత, గిరిజన దండోరా" రెండో సభ స్థలాన్ని మార్పు చేశారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రావిరాల గ్రామానికి సభా వేదికను మార్చారు. నిజానికి పోలీసుల అనుమతి అని కారణం చెబుతున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుపుల్ల వేయడమేనని కాంగ్రెస్‌లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ సభ వేదికను మార్చడం వెనుక కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం చాలా ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు.
తన నియోజకవర్గంలో " దళిత, గిరిజన దండోరా "కు రాలేనన్న కోమటిరెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకాన్నిప్రవేశ పెట్టారు. దీనికి కౌంటర్‌గా దళితులతో పాటు గిరిజన వర్గాలను వంచించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ " దళిత, గిరిజన దండోరా " సభలను నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా ఇంద్రవెల్లిలో నిర్వహించారు. తర్వాతి సభను 18వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించాలని వేదిక ఖరారు చేశారు. కానీ అనూహ్యంగా సభా వేదికను రావిరాల గ్రామానికి మార్చారు. గతంలో రేవంత్ రెడ్డి వ్యవసాయ సమస్యలపై పాదయాత్ర చేసి రావిరాలలోనే ముగింపు సభ నిర్వహించారు. ఇప్పుడు అక్కడే " దళిత, గిరిజన దండోరా " నిర్వహించాలని నిర్ణయించారు. దానికి కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం చెప్పడమేనంటున్నారు.
Also Read: Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఏపీలో కూడా ఈ ప్రాంతాల్లో.. వాతావరణశాఖ హెచ్చరిక
చివరికి సభా వేదికను మార్చిన రేవంత్ రెడ్డి..!
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అయితే తన ప్రమేయం లేకుండా " దళిత, గిరిజన దండోరా "నిర్వహించడం... తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా సభ వేదిక, సమయాన్ని ఖరారు చేయడం ఏమిటని ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యుల్లో ఒకరైన కేసీ వేణుగోపాల్ అటు కోమటిరెడ్డితోనూ ఇటు రేవంత్‌రెడ్డితోనూ మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. తర్వాత కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని.. ఇబ్రహీంపట్నంలో 18వ తేదీన సభ పెడితే తాను హాజరు కాబోనని.. తనకు పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. దాంతో స్థానిక ఎంపీ లేకుండా " దళిత, గిరిజన దండోరా "సభ నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా సభా వేదికను మార్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంద్రవెల్లిలో జరిగిన " దళిత, గిరిజన దండోరా "సభకు కూడా కోమటిరెడ్డి హాజరు కాలేదు. ప్రస్తుతం నిర్వహించాలనుకుంటున్న రావిరాల గ్రామం చేవెళ్లే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దాంతో అక్కడకు సభావేదికను మార్చారు.
రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ ఎదురవుతోందా..?
ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుని సభను నిర్వహించేవారని.. ఆయన దూకుడు రాజకీయం తెలిసిన కాంగ్రెస్ నేతలంటున్నారు. సభకు మరింత హైప్ తెచ్చుకునేందుకు పోలీసుల అణిచివేతను వాడుకునేవారంటున్నారు. అయితే ఇక్కడ పోలీసుల ఆంక్షల కన్నా ఎక్కువగా ఆయనకు సొంత పార్టీలో ఇబ్బందులే ఎక్కువ అని.. అందుకే సభా వేదికను మార్చుకోక తప్పలేదంటున్నారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లు అందర్నీ కలిసి .. కలసి పని చేద్దామని ఆహ్వానించారు. ఒక్క కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రమే తనను కలవొద్దని రేవంత్ రెడ్డి మొహం మీదనే చెప్పారు. అదే పద్దతిలో రేవంత్ రెడ్డికి సహకరించేందుకు సిద్ధంగా లేరని తాజా పరిణామాలతో వెల్లడవుతోందని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏకతాటిపైకి రాలేదని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయంటున్నారు.
Also Read: Huzurabad By Elections: హుజూరాబాద్ లో రోజురోజుకు మారుతున్న సమీకరణాలు