Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ కనుక పాకిస్థాన్ తో యుద్ధం చేస్తే దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలు వెళ్లి పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అలాంటి కామెంట్లు చేయలేదు.
భారత్ ఒకవేళ పాకిస్తాన్‌తో యుద్ధం మొదలుపెడితే, దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలు పాకిస్తాన్ సైన్యంలో చేరతారు అని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు దాదాపు పదేళ్ల కిందట పబ్లిష్ అయినట్లు ఓ న్యూస్ క్లిప్పింగ్ తాజాగా సోషల్ మీడియా(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది.
The archived post can be seen here.
క్లెయిమ్: ‘భారత్ పాకిస్తాన్‌తో కనుక యుద్ధానికి దిగితే దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలు పాకిస్తాన్ సైన్యంలో చేరతారని’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారని ప్రచారం.
నిజం: ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. భారత్ పాక్‌తో యుద్ధం చేస్తే దేశంలోని ముస్లింలు పాకిస్థాన్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసినట్లు ఏ ప్రముఖ వార్తా పత్రిక, టీవీ, ఇతర మీడియా సంస్థలు రిపోర్ట్ చేయలేదు. పైగా ఈ ఆరోపణలపై 2015లో ఒక ఇంటర్వ్యూలో అసదుద్దీన్ స్పందించారు. అలాంటి కామెంట్లు చేయలేదని స్పష్టం చేసిన అసదుద్దీన్ ఒవైసీ, తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థపై చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరాధార వార్త ప్రచురించిన, ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు తనకు క్షమాపణ చెప్పాయని ఎంఐఎం చీఫ్ వెల్లడించారు. కనుక, ఆ సోషల్ పోస్ట్‌లో అసదుద్దీన్ కామెంట్లు అన్న వార్తలో నిజం లేదని స్పష్టమైంది.
అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అని వైరల్ అయిన పోస్ట్‌పై కీవర్డ్ సెర్చ్ చేయగా 2014లో కాశ్మీర్ అబ్జర్వర్ పబ్లిష్ చేసిన వార్త కనిపిస్తోంది. ఒకవేళ భారత్ కనుక పాక్ తో యుద్ధానికి దిగితే దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలు పాకిస్తాన్ సైన్యంలో చేరతారంటూ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్త పబ్లిష్ అయింది. అసదుద్దీన్ నిజంగానే అలాంటి సంచలన వ్యాఖ్యలు చేసి ఉంటే, ప్రముఖ వార్తా పత్రికలు, మీడియా సంస్థలు కచ్చితంగా ఆ వార్తను కవర్ చేసి ఉండేవి. కానీ ప్రముఖ మీడియాలో ఆ వార్త ఎక్కడా కనిపించలేదు.
తనపై వచ్చిన ఆరోపణల్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గతంలోనే ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వార్తా సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఓ ట్వీట్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) చేశారు.
My lawyer will send legal notice t Jammu observer if they apologise fine if nt then will file crim defamation against them will pursue it
— Asaduddin Owaisi (@asadowaisi) September 2, 2014
దీనిపై మరింత రీసెర్చ్ చేయగా హెడ్‌లైన్స్ టుడేతో 2015లో అసదుద్దీన్ ఇంటర్వ్యూ(interview) కనిపించింది. ఎవరో చేసిన వ్యాఖ్యలను తాను చేసినట్లుగా వచ్చిన ఆరోపణల్ని అసదుద్దీన్ ఖండించారు. ఆ వార్త సంస్థపై లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు తెలిపారు. నిరాధార వార్త పబ్లిష్, ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు అసదుద్దీన్ కు క్షమాపణ చెప్పాయి. 2019లో ఫ్యాక్ట్‌లీ ఈ విషయంపై వాస్తవం ఏంటో తెలిపింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఒవైసీపై మరోసారి దుష్ప్రచారం జరుగుతోందని స్పష్టమైంది.
పాక్‌తో భారత్ కనుక యుద్ధం చేస్తే దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలు వెళ్లి పాకిస్తాన్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
This story was originally published by Factly.in, as part of the Shakti Collective. This story was edited by ABP Desam staff.