CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Andhra News: సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు.
CM Chandrababu Comments: సామాజిక మాధ్యమాల్లో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. ఢిల్లీలో పర్యటించిన ఆయన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పని చేసిన తనను అక్రమ కేసులు పెట్టి వేధించారని.. చెయ్యని తప్పునకు 53 రోజులు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను ఎక్కడా నిరాశకు గురి కాలేదని.. ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలనే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నానని అన్నారు. 'సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్లని ఏం చేయాలి.?. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదంటే ఎలా.?. సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.' అని పేర్కొన్నారు.
'తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్'
దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నామని.. దీని ద్వారా ప్రజలకు నేరుగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 'ఏపీ అన్ని రంగాల్లో అగ్రభాగాన నెంబర్ వన్‌గా ఉండాలనేదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏఐ, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు మనం చేసుకుంటూ పోవచ్చు.' అని పేర్కొన్నారు.
'అందుకే ఆ నిబంధన'
'భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తీసుకువస్తే.. 30 - 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పని చేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి.. కనీసం ఇద్దరు పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకటో తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది'
'ఏపీలో 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో పాటు.. ఎన్డీయే కూటమిపై జనానికి భరోసా కలిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేం ముందే ఊహించాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93 శాతం సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ 3 పార్టీలను కలిపారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.