
Maharastra Elections : ఇది శివాజీ పుట్టిన నేల మా సహనం పరీక్షించకండి- మహారాష్ట్ర వేదికగా పవన్ కల్యాణ్ హెచ్చరిక
Pawan Kalyan: మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. డేగ్లూర్ నియోజకవర్గంలో బహిరంగసభలో తెలుగులోనే ప్రసంగించారు.

Maharastra : దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి కొంత మంది వచ్చి మాకు 15 నిమిషాలు ఇవ్వండి అని కథలు చెప్ప్తారని.. పాత బస్తీలో కూర్చుని పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం అంటారని.. ఇది చత్రపతి శివాజీ పుట్టిన నేల, మా సహనం పరీక్షించకండని పవన్ హెచ్చరికలు జారీ చేశారు.మహారాష్ర్ట ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూర్ సభలో జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలా సాహెబ్ స్ఫూర్తితో ప్రాంతీయత విస్మరించని జాతీయవాదం
ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.బాబా సాహెబ్ అంబేద్కర్ కర్మ భూమిగా నిలచిన గొప్ప భూమిపై గౌరవం తెలపడానికి వచ్చాను. రాజ మాత జీజీయా భాయ్ నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చానన్నారు. జనసేన ఏడు సిద్దాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ స్ఫూర్తి. ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పడం.. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం. అధికారంతో సంబంధం లేకుండా మన సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం బాలా సాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నానన్నారు.
మహారాష్ట్ర అభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు
గడచిన పదేళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలనను గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కనబడుతుంది. దివ్య రామమందిరంతో అలంకరించిన ఆయోధ్య కనబడుతుంది. ప్రపంచ పటంపై.. తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోందన్నారు. ఎన్డీఏ పాలనలో దేశ నలూములలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు కనబడుతోంది. గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది. గత పదేళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ గడ్కరీ గారు 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ది మహామార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోందని తెలిపారు.
సాధువుల్ని, సంతవుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం మనకు కావాలి..!
మహారాష్ట్ర చరిత్రను చూస్తే ఎంతో మంది సనాతన ధర్మాన్ని రక్షించేందుకు కృషి చేశారు. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పాల్గర్ లో సాధువులు వేడుకున్నా వదలకుండా చంపేశారు. విశాల్ ఘడ్ చారిత్రక ఖిల్లాను ఆక్రమించారు. ఒక వర్గం ప్రజలను శాంతింపచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మనకి కావాల్సింది ఇలాంటి ప్రభుత్వాలు కాదు. సాధువుల్ని, సంతవుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం మనకు కావాలి. మహారాష్ట్ర వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ పోరాడిన దుర్గాలన్నీ దక్షిణ భారతాన్ని హిమాలయ పర్వతంలా కాపాడాయి. ఆక్రమణ దారుల్ని రానివ్వకుండా చేశాయి. దీంతో దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి నేను మహారాష్ట్ర నేల, వీరులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విశాల్ ఘఢ్ ఖిల్లా అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు కైవసం చేసుకున్నారు. చత్రపతి శివాజీ పోరాడింది వీరి మీదే. ఇప్పుడు మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరాఠా భాష, సంస్కృతి కోసం మనమంతా కలసి పని చేయాలని పవన్ పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
