Adilabad News: ఆదిలాబాద్ కలెక్టర్‌తో అంత ఈజీ కాదు.. రాత్రిపూట గుడిహత్నూర్ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు
Adilabad Collector News | గుడిహత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రిపూట ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యులు,సిబ్బంది పని తీరు పై ఆరా తీశారు.

Adilabad Collector Inspection at Gudihatnoor PHC | గుడిహత్నూర్: ఇటీవల ఓ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్కూలు, హాస్టల్ లో వారికి కల్పించిన వసతులతో పాటు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీసి వారిలో నమ్మకాన్ని పెంచారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ (PHC) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం రాత్రిపూట ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా వివిధ వార్డులు, ఔషధ నిల్వ గదులు (Storage Room), వ్యాక్సినేషన్ గది, ప్రసూతి విభాగం, రిజిస్టర్ నమోదు పద్ధతులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆరా తీసిన కలెక్టర్
గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవల నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. ఔషధాల లభ్యత, శుభ్రతా ప్రమాణాలు, రోగి రిజిస్టర్లు, నర్సులు, వైద్యుల హాజరు రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు అందిస్తున్న వైద్యం గురించి, ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది, స్టాప్ కు సంబంధించి ఇతర వివరాలను PHC మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో ఆసుపత్రి ప్రసూతి వార్డులో పేషంట్ తో వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడి.. డెలివరి ఎప్పుడైంది, శిశువు ఆరోగ్యంగా ఉందా, బరువు ఎంత, ఏ ఊరి నుండి వచ్చారు, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

రిపేర్ చేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓకు ఆదేశాలు
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు సమర్థవంతమైన, సమయోచితమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఆరోగ్య కేంద్రంపై ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, ఇండెంట్ పెట్టాలని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో అవసరమైన మరమ్మతులు చేసుకోవాలని, కిటికీ అద్దాలు పగిలి ఉండడంతో రిపేర్ చేయించాలని డిప్యూటి డీఎంహెచ్ఓ మనోహర్ ను ఆదేశించారు. ఈ ఆసుపత్రి తనిఖీలో గుడిహత్నూర్ PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్యామ్ సుందర్, స్టాఫ్ నర్స్ తిరుమల రాణి, ఆసుపత్రి సిబ్బంది అటెండర్లు, తదితరులు ఉన్నారు.





















