Adilabad Crime News: జన్నారం సైబర్ నేరాల వెనుక అసలు సూత్రధారి జాక్! కోటి రూపాయల లావాదేవీలు, షాకింగ్ విషయాలు!
Adilabad Crime News: మంచిర్యాల కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తే కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడైంది.

Adilabad Crime News: మంచిర్యాలలోని జన్నారంలో వెలుగులోకి తీసుకొచ్చిన సైబర్ క్రైమ్‌లో మరిన్ని సంచలనాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంబోడియా, మయన్మార్ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం తతంగం నడిపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. రోడ్డు పక్కనే అమ్మే వారి వద్ద మొబైల్ సిమ్‌లు కొని వందల మందిని ముంచేశారు.
జన్నారం కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలకు రామగుండం పోలీసులు చెక్ పెట్టారు. నలుగురిని అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫోన్ లొకేషన్ గుర్తు పట్టకుండా ఉండేందుకు నేరగాళ్లు ఈ జన్నారాన్ని ఎంచుకున్నట్టు తేలింది. ఒకవేళ ఐఎంఈఐ నెంబర్ గుర్తు పట్టినా అది అడవులు, చెట్లు మధ్య చూపిస్తుందని గ్రహించారు. అందుకే జన్నారాన్ని ఎంచుకొని కాంబోడియా, మయన్మార్ నుంచి రాకెట్ నడిపించారు.
ఈ మోసాల కోసం సిమ్ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు పక్కనే అమ్మే వారి వద్ద విక్రయించే వాళ్లు. వీళ్లకు జాక్ అలియాస్ రాజు అనే విశాఖ వాసి సహకరించాడు. ఈ సైబర్ కుట్రలో అతనే కింగ్‌పినగా భావిస్తున్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేయడానికి ఒక సిమ్ మాత్రమే వాడతారు. తర్వాత దాన్ని నాశనం చేస్తున్నారు. ఆ సిమ్ కార్డు నుంచి ఎవరికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఎంత వసూలు చేశారో రికార్డు చేశారు. వాటిని బుక్స్‌లో రాసేవారు.
పరారీలో ఉన్న జాక్ బ్యాంకు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు. కోటి రూపాయల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. అతనికి సహకరించిన వాళ్లకు లక్షల్లో నగదు పంచినట్టు తేలింది. ఎలా ఎక్కడికక్కడ టీంలను ఏర్పాటు చేసుకొని క్రైమ్‌ను విస్తరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
ఫోన్‌లో మాట్లాడిన సిమ్ కార్డు లొకేషన్ వివిధ ప్రాంతాల్లో చూపించి కన్ ఫ్యూజ్ చేయడానికి కొత్త ఎత్తుగడ వేశారు సైబర్ నేరగాళ్లు. లేటెస్ట్ సాంకేతిక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఓ బాక్స్‌లో వందల సిమ్ కార్డులు పెట్టి ఫోన్‌లు చేసే వాళ్లు. ఇలా చేయడం వల్ల అన్ని ఒకే మిషన్‌లో ఉండడంతో అసలు వ్యక్తులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారనే విషయం గుర్తు పట్టలేరు. అందులోనూ జన్నారం లాంటి అటవీ ప్రాంతంలో ఇది మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నారు.
జాక్ అనే వ్యక్తిని పట్టుకుంటే ఈ కుట్రలో ఇంకా ఎంత మంది ఉన్నారో అర్థమవుతుందని రామగుండం పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి చిక్కిన నిందితులను జైలుకు తరలించారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.





















