Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీరో అవర్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఇది డ్రైవర్ లేని కారులా తయారైందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అసహనం వ్యక్తం చేయగా.. సమస్యలు తాను రాసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
Minister Atchennaidu Replies To MLA On Zero Hour: ఏపీ అసెంబ్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీరో అవర్‌పై (Zero Hour) శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి. జీరో అవర్ డ్రైవర్ లేని కారులా తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravikumar) అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తోన్న సమస్యలను మంత్రులెవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) మంత్రులు సమస్యలు రాసుకుంటున్నారని.. నిండు సభలో అసత్యాలు మాట్లాడకూడదని చెప్పారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) స్పందించారు. సమస్యలను తాను రాసుకుంటున్నానని తెలిపారు. అవి పరిష్కరించిన తర్వాత సభ్యులకు సమాచారం ఇస్తామని అన్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. కాగా, కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వల్లే ముందు జరిగేది తెలియడం లేదని స్పీకర్ పేర్కొన్నారు.
'జగన్ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు'
మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. టిడ్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలనామోదం లేకుండా ఇచ్చారని చెప్పారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని అన్నారు. 'వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేశారు. కాంట్రాక్టర్‌గా తనకు రావాల్సిన బకాయే రూ.87 కోట్లుగా ఉంది. నాలాంటి వ్యక్తులు పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదు. కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారు.' అని పేర్కొన్నారు. అటు, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సైతం అప్పటి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిర్మాణాలను గాలికొదిలేసి పేదలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. పేదవాళ్లు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని.. ఇళ్ల నిర్మాణాలు లేవని.. డిపాజిట్లు తిరిగి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ట్రోల్స్‌పై..
సోషల్ మీడియాలో ట్రోలర్స్‌పైనా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈ మేరకు జీరో అవర్‌లో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో భవానీ అప్పట్లో మాట్లాడిన మాటల్నే ట్రోల్ చేశారని.. గత స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇదే సమయంలో గత ఐదేళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపైనా విచారణ జరిపించాలని కోరారు.
మరోవైపు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలని సవరించాలని కోరారు. అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అన్ని పార్టీల నేతలనూ సోషల్ మీడియా సైకోలు ఇబ్బంది పెడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.