Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nara Ramamurthy Naidu Passes Away | ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.
AP CM Chandrababu brother Nara Ramamurthy Naidu Passes Away in Hyderabad | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కావడంతో శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆదివారం నాడు వారి స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు తనయుడే టాలీవుడ్ హీరో నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే.
అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్‌కు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అయితే తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే ఢిల్లీ, మహారాష్ట్ర లోని అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అనంతరం సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణవార్త తెలియగానే సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి 3.30 కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లనున్నారని అధికారులు తెలిపారు.
చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియగానే ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ కు వచ్చారు. గచ్చిబౌలిలోని ఆసుపత్రికి వెళ్లి సోదరుడు నారా రోహిత్, కుటుంబసభ్యులను పరామర్శించారు. నారా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. గచ్చిబౌలిలోని ఆసుపత్రికి వెళ్లి నారా రోహిత్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.