Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Telangana News: లగచర్ల ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతల బృందం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.
BRS Leaders Complaint To SC ST Commission On Lagacharla Case: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. లగచర్లలో (Lagacharla) రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు విమర్శించారు. బాధిత మహిళలతో కలిసి శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించారు. రైతులు దాడులు చేశారనే కారణంతో అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి బూతులు తిట్టారని.. వేధించారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'దురహంకారంతో భూములు లాక్కొంటున్నారు'
కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములు లాక్కుకుంటారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులను మెప్పించడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి... ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడో చెప్పాలన్నారు. రేవంత్ సీఎం అయితే మాకు లాభం జరుగుతుందని గిరిజనులు అనుకుంటే వారి పొట్టకొడుతున్నాడని విమర్శించారు. ఫార్మా కంపెనీ కారణంగా కాలుష్యంతో జీవితాలు ఆగమవుతాయని లగచర్లలో చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని.. ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు సోయి లేదో చెప్పాలన్నారు. 'కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టడమేంటి?. అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా రైతులను జైలుల్లో పెట్టడం అమానుషం. సీఎం ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమన్న ఇక్కడ ప్రజలపై పెట్టాలి. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కలెక్టర్‌పై దాడులు చేశారంటూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.' అని డిమాండ్ చేశారు.
'ఎస్సీ, ఎస్టీలపై దాడి'
లగచర్లలో నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో మహిళలపై పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని మండిపడ్డారు. వెంటనే ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచార కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తోందన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని ఆయన చెప్పారు.
'ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోం'
ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని గట్టిగా చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు, జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు.
Also Read: Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ