Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Telangana News | వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Kakatiya Mega Textile Park | వరంగల్: వరంగల్ (Warangal) కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. టెక్స్ టైల్ పార్కు కోసం భూమలు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూ నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయంలో తాము భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, తమకు న్యాయం జరగలదేని టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి న్యాయం చేయడానికి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు
వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో చింతలపల్లి వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2016 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి దశలవారీగా 1357 ఎకరాలను సేకరించారు. ఈ క్రమంలో 2017 అక్టోబర్ 22న అప్పటి సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్ టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. స్థానికులకు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని, వారి జీవితాలు మారతాయని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వడంతో పాటు టెక్స్ టైల్ పార్క్ఏరియాలో ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున చేసి నిర్వాసితులకు డబుల్ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ నెలలు, ఏళ్లు గడిచినా పూర్తి స్థాయిలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కాలేదు. దాంతో ఇంటికో జాబ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ సర్కార్ కట్టించి ఇవ్వలేదు.
గత ప్రభుత్వం చెప్పడంతో భూములు ఇచ్చిన రైతులు
యంగ్ వన్ కంపెనీ, కైటెక్స్ కంపెనీ, మరో కంపెనీల ద్వారా 50 నుంచి 60 వేల ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వం చెప్పడంతో రైతులు భూములు ఇచ్చారు. మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే కంపెనీల ద్వారా పత్తికి భారీ ధరలు వస్తాయని.. మేడిన్ తెలంగాణ, మేడిన్ వరంగల్ అంటూ కేటీఆర్ చెప్పారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు అమెరికా, యూరప్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి అవుతాయని గత పాలకులు చెప్పారు. కానీ చెత్త నుంచి దారం తీసే కంపెనీలు వచ్చాయని, మెషీన్ల ద్వారా పని జరుగుతోందని.. మిగతా పనిని బిహార్, ఒడిశాల, ఝార్కండ్ నుంచి వచ్చే వకూలీలతో చేపిస్తున్నారని గతంలోనే అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు భూమి పోయిందని, ఇటు ఇండ్లు ఇవ్వకపోగా, ఉద్యోగాలు కూడా రాలేదని పలుమార్లు నిరసన తెలిపారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

