(Source: ECI/ABP News/ABP Majha)
Eetala on New Secretariat: నేతల ఆనవాళ్లు లేకుండా చేయడానికే కొత్త సచివాలయం, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eetala on New Secreatariat: కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజూ ఆఫీస్ కి వస్తారా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
Eetala on New Secreatariat: రాష్ట్రంలో నిర్మించిన నూతన సచివాలయంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్లు చేశారు. కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలల పాటు ప్రతి రోజూ ఆఫీస్ కి వస్తారా అని ప్రశ్నించారు. అయినా ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికే కొత్త సచివాలయం ఏర్పాటు చేశారంటూ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం అంటూ చెప్పుకొచ్చారు. తొమ్మిది సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తం అయ్యిందని... వ్యవస్థలు చట్టుబండలు అయ్యాయని ఈటల వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగు పడాలి అని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
"వాస్తవంగా మనది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు హైదరాబాద్ రాజధానిగా కొనసాగడం కష్టం. 8 కోట్ల జనాభాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిపడా సచివాలయం కల్గిన రాష్ట్రమిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లాగా కొత్త రాష్ట్రంగా ఏర్పడలే. కొత్త సచివాలయం, కొత్త ఆఫీస్ అవసరం లే. 8 కోట్ల మంది ప్రజలకు సర్విస్ చేయగల్గినటువంటి గొప్ప సచివాలయాన్ని ఆనవాళ్లు ఉండొద్దు, ఇతర నాయకుల ఆనవాళ్లు ఉండొద్దు.. చరిత్రలో నేనే గొప్పవాడిని అని చెప్పుకునేందుకు సచివాలయాన్ని కట్టుకున్నరు. ఇప్పుడు సచివాలయం కట్టినదాన్ని వ్యతిరేకిస్తలేను గానీ ఇవాళ ఆయన పేరు కోసం, ఆయన ప్రతిష్ట కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు.
నేను ఒకటే డిమాండ్ చేస్తున్న. ఎన్నడూ ఆఫీస్ కు రాని ముఖ్యమంత్రి మరి కొత్త సచివాలయం అయినా కట్టుకొని.. కొత్త సచివాలయానికి వస్తరని, ప్రజలను కలుస్తరని సమస్యలు పరిష్కరిస్తవని కోరుతున్న. ఎందుకంటే సచివాలయంలో సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేసే సిస్టం ఉంది. తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ఏ మనిషినీ కలవలే. ఏ అధికారినీ కలవలే. సచివాలయమే నడవలే. ఏ మంత్రి శాఖ, ఏ మంత్రి ఆఫీస్ ఎక్కుడుందో కూడా తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం చట్టుబండలు అయిపోయినయ్. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా చట్టుబండలు అయిపోయినయ్. నిర్వీర్యం అయిపోయినయ్. ఇప్పటికైనా ఇగ మూడు నెల్లో నాలుగు నెల్లో ప్రభుత్వం ఉంటది కావచ్చు. ఈ మూడు నెలలు, నాలుగు నెలలు అయినా కొత్త సచివాలయంలో అయినా ముఖ్యమంత్రి గారు అందుబాటులో, మంత్రులు అందుబాటులో ఉండి.. ప్రజల బాధలు, గాధలు విని పరిష్కరిస్తరని నేను భావిస్తున్నానని." హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.