Telangana Eagle: తెలంగాణపై ఈగిల్ నిఘా - గంజాయి, డ్రగ్స్ పై బ్రహ్మాస్త్రం
Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రకటించారు.

EAGLE to eradicate drugs: తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) ను ఏర్పాటు చేసింది. ఈ విశేష విభాగం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) కింద పనిచేస్తుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో EAGLE ఏర్పాటును ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహితంగా తీర్చిదిద్దడం, గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల విక్రయాన్ని నిర్మూలించడం లక్ష్యంగా ఈగిల్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
EAGLE ప్రధాన లక్ష్యాలు
1. తెలంగాణ భూభాగంలో గంజాయి మొక్కల సాగును పూర్తిగా అరికట్టడం.
2. రాష్ట్ర సరిహద్దులలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం.
3. విద్యార్థులు, యువత, మరియు సామాన్య ప్రజలలో మాదక ద్రవ్యాల హానికర ప్రభావాలపై అవగాహన కల్పించడం.
4. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వ్యాపారులు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం.
5. రాష్ట్రంలో వ్యసనపరుల కోసం డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, రిహాబిలిటేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించడం.
ఈ టాస్క్ ఫోర్స్ తెలంగాణ పోలీసు శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA), కేంద్ర సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో సమన్వయంతో పనిచేస్తుంది. EAGLE టీమ్‌లోని సిబ్బంది కోసం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంటెలిజెన్స్ సేకరణ, దర్యాప్తు వంటి విధానాలు ఉంటాయి.
EAGLE ఒక డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ (897781972), టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (1972)ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా ప్రజలు మాదక ద్రవ్యాల కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందించవచ్చు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర, జిల్లా, మండల, మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ సచివాలయాలలో 10 సభ్యులతో కూడిన ‘EAGLE కమిటీలు’ ఏర్పాటు చేస్తారు.
EAGLE…
— Revanth Reddy (@revanth_anumula) June 26, 2025
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.
తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.
శిక్షణ పొందిన… pic.twitter.com/veqcwzLJ9G
డ్రగ్స్ పట్టుబడితే కళాశాల యాజమాన్యంపై కేసులు
మాదక ద్రవ్యాల వినియోగం కేవలం చట్టం ,శాంతిభద్రతల సమస్య కాదు, సామాజిక ముప్పు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస అయితే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు విఫలమవుతాయన్నారు. స్కూళ్లలో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యాలపై కేసులు పెడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2024 నవంబర్ 28న EAGLE ను ఏర్పాటు చేసింది, దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. ఇది 26 జిల్లాలలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ (DNCC)ను స్థాపించింది. ఐదు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపింది





















