Telangana Assembly : ఫిరాయింపుల వైపు మళ్లిన చర్చతో గందరగోళం - తెలంగాణ అసెంబ్లీలో అసలేం జరిగిందంటే ?
Telangana : తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ రాజకీయం వైపు వెళ్లింది. వ్యక్తిగతంగా మాట్లాడుకున్న అంశాలు చర్చకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ మొదటి సారి ఆకస్మాత్‌గా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో అనుకోకుండా రాజకీయ అంశాలకు చర్చకు రావడంతో చర్చ పూర్తిగా దారి తప్పింది. రాజకీయంగా పెను వివాదానికి కారణం అయింది. మొదట రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కలు అంటూ ప్రస్తావించి వారు రాజకీయంగా మోసం చేస్తారని వారిని నమ్మవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రేవంత్ రెడ్డి పదే పదే టార్గెట్ చేస్తున్నారని.. ఆడబిడ్డలను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తానే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించానని ప్రకటించారు.
దీంతో అంశం అంతకంతకూ పెద్దదిగా మారింది. రేవంత్ రెడ్డి ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదని మరో మంత్రి శ్రీధర్ బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డిపై మరోసారి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల పాటు పదవులు అనుభవించి ఆ తర్వాత పదవుల కోసమే బీఆర్ఎస్‌లోకి సబితా ఇంద్రారెడ్డి మారారన్నారు. పార్టీ మారాలనుకున్న రోజున ఆమెను బతిమాలామని.. ఆమె పార్టీ మారితే.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుని .. దళితుడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తారని చెప్పామన్నారు. అయినా ఆమె వినలేదన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను సబితక్క బయట పెట్టారని కొనసాగింపుగా ఏం జరిగిందో కూడా తాను చెప్పాల్సి ఉందన్నారు.
తనను కాంగ్రెస్ పార్టీకి సబిత ఆహ్వానించిన మాట నిజమేనన్నారు. కొడంగల్‌లో ఓడిపోయిన తర్వాత .. మల్కాజిగిరిలో పోటీ చేయాలని పిలిచారని.. సహకరిస్తామని కూడా చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్‌లో చేరి.. తనను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. మధ్యలో సీతక్క కూడా.. ఇద్దరు అక్కలు కాంగ్రెస్ లో చేరేందుకు రేవంత్ ను సంప్రదించి.. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి తగ్గారని ఆ బాధ సీఎంలో ఉందన్నారు. మొత్తంగా ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ పక్కదారి పట్టింది. రాజకీయ ఫిరాయింపుల దిశగా వెళ్లింది.
ఈ చర్చలో తనను అవమానించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహిళా సభ్యురాలిని అవమానించినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో ఈ గందరగోళం నడుస్తున్న సమయంలో.. కొత్త గవర్నర్‌కు స్వాగతం చెప్పాల్సి రావడంతో ఆయన మధ్యలో బయటకు వెళ్లారు. అప్పుడు సభ వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ.. రేవంత్ సబితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభ్యులు.. పోడియంను ముట్టడించారు. దీంతో.. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించి స్పీకర్ సభను వాయిదా వేశారు. తనను సభలో అవమానించారని.. క్షమాపణలు చెప్పాలని సబిత ఇంద్రారెడ్డి సభ వాయిదా పడిన తర్వాత డిమాండ్ చేశారు.