Congress CPI alliance : కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై కసరత్తు - కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ చర్చలు !
కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ సమావేశం అయ్యారు. రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరిపారు.
Congress CPI alliance : తెలంగాణలో కాంగ్రెస్‌తో నడిచేందుకే సీపీఐ మొగ్గు చూపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రెడ్లు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. పొత్తు, సీట్లపై కేసీ, నారాయణ చర్చించినట్టు తెలుస్తోంది. చర్చలు సఫలమయ్యాయని, కాంగ్రెస్ తో కలిసి వెళ్తామని నారాయణ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర సీపీఎం నేతలతో జాతీయ కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. గెలవగలగే స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో సీటు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కమ్యూనిస్టులు మాత్రం చెరో మూడు సీట్ల కోసం పట్టుబడుతున్నారు. చెరొకటి లేదా చెరో రెండు సీట్లతో పొత్తు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసే ఉన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ కలిసి పని చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినప్పటికీ కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించలేదు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. మనుగోడులో కమ్యూనిస్టులకు నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంక్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే బీజేపీని ఓడిచే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్న కమ్యూనిస్టులు ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేదని ప్రకటనలు చేశారు.
ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ కూడా తమ మధ్య బంధం ఈ ఒక్క ఎన్నికకే కాదని వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పని చేస్తామని చెప్పారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ కమ్యూనిస్టును దూరం పెట్టావారు. వారు కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్నందున తాము కమ్యూనిస్టులతో కలవబోమని చెప్పారు.దీంతో వామపక్షాలు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశాయి. కేసీఆర్ మోసం చేశారని మండిరడ్డాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు.
దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు ప్రతి నియోజకవర్గంలో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తూంటాయి. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల నేతల ఓట్లతోనే గెలిచిందని... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీకి మెరుగైన సీట్లు వస్తాయన్న అంచనాలు ఉండటంతో కాంగ్రెస్ కూడా పొత్తుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.