Sharmila Invites Chandrababu: కుమారుని వివాహానికి చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం - రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
Hyderabad News: టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ నాయకురాలు షర్మిల కలిశారు. తన కుమారుని వివాహానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Sharmila Invites Chandrababu For Her Son Marriage: కాంగ్రెస్ నాయకురాలు షర్మిల (Sharmila) టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) శనివారం హైదరాబాద్ (Hyderabad) లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుని పెళ్లికి హాజరు కావాలని ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ కు సైతం ఆహ్వానం పలికారు. కాగా, షర్మిల కుమారుడు రాజారెడ్డికి.. ప్రియా అట్లూరితో ఈ నెల 18 నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఇప్పటికే షర్మిల సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
షర్మిల ఏమన్నారంటే.?
'నా కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశాను. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది. వైఎస్ తో అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ కు స్వీట్లు పంపాం. కేటీఆర్, కవిత హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపాం. ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దు.' అని షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో భేటీ పొలిటికల్ పరంగా చూడకూడదని షర్మిల అన్నారు. తమకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండవు.. ఉండబోవని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సైతం తన పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారని.. ఆయనా హాజరయ్యారని గుర్తు చేశారు. ఇదేమీ వింత.. విచిత్రం కాదని.. ఈ భేటీని స్నేహపూర్వక వాతావరణంగానే చూడాలని చెప్పారు. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్ అని.. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటామని అన్నారు. తాము కేవలం రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. అందరం ప్రజల కోసమే పని చేస్తామని.. పండుగకో, లేదా పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
'రాహుల్ ప్రధాని కావాలి'
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నెరవేరుస్తానని షర్మిల ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 'రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలి. ఆయన ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుంది. వైఎస్ లక్ష్యం కూడా అదే. నాకు బాధ్యతలు అప్పగించిన అంశం బట్టి చేరికలపై తర్వాత చెప్తా.' అని వ్యాఖ్యానించారు.
పెళ్లి పనుల్లో బిజీ బిజీ
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారుని వివాహానికి ఆహ్వానించారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులకు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. కుమారుని వివాహం అనంతరం షర్మిల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన నేపథ్యంలో అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.