TS Congress : హుజురాబాద్ ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. 13న టీ పీసీసీ నేతలతో ఢిల్లీలో సమీక్ష !
హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో వారిని ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది.
హుజురాబాద్ పరాభవం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కూడా ఆగ్రహం తెప్పించింది. కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోవడం ఎవరి వైఫల్యమో తేల్చాలని డిసైడయింది. అందుకే 13న హుజురాబాద్ ఫలితంపై ఢిల్లీలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. టీపీసీసీ నుంచి పలువురు నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతలు ఢిల్లీకి రావాలని ఆహ్వానాలు అందాయి. అభ్యర్థి బలమూరి వెంకట్‌కు కూడా ఆహ్వానం వెళ్లింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇప్పటికే ఓటమికి కారణాలను అన్వేషించడానికి టీ పీసీసీ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా హైకమాండ్‌కు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Also Read : కల్వకుంట్ల కవితకు మరోసారి ఎమ్మెల్సీ చాన్స్ వస్తుందా ?
హుజురాబాద్ ఎన్నికల ఫలితం విషయంలో ఇప్పటికే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అయితే హుజురాబాద్‌లో పార్టీ కోసం పని చేయని వారు రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని ఆయన వర్గం వాదిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హైకమాండ్‌కు పలువురు నివేదికలు పంపినట్లుగా తెలుస్తోంది. గెలవకపోయినా ఓట్ల శాతం దారుణంగా పడిపోవడానికి బీజేపీతో కుమ్మక్కు కావడమే కారణమని సీనియర్లు ఆరోపిస్తున్నారు.
Also Read : షర్మిల పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి .. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన !
తెలంగాణ ఇచ్చిన పార్టీగా పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొంత కాలంగా పరిస్థితులు సహకరించడం లేదు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, ఇప్పుడు హుజురాబాద్‌లో ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌వచ్చిందని ఆ పార్టీ నేతలు సంబర పడుతున్నారు. అయితే హుజురాబాద్‌లో ఓట్ల శాతం దారుణంగా పడిపోవడం వారిని మరింత కలవర పరిచింది. అందుకే బీజేపీ హైకమాండ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !
కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఉపఎన్నిక ఫలితంపై ఎలాంటి నివేదికలు ఉన్నాయో కానీ.. సమీక్షలో మాత్రం సీనియర్ నేతలకు అక్షింతలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలతో పోటీ పడటం కన్నా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రోడ్డున పడటం ఆపాలని హెచ్చరించి పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు