Telangana CM : తెలంగాణ రైతులకు సాయంగా డిజిటల్ ఫ్లాట్ ఫాం - రైతు నేస్తంను ప్రారంభించిన సీఎం రేవంత్
Telangana CM : రైతులకు అండగా ఉండే డిజిటల్ ఫ్లాట్ ఫాం రైతు నేస్తంను సీఎం రేవంత్ ప్రారంభించారు. అన్ని అంశాల్లో రైతులకు చేదోడు, వాదోడుగా ఉంటుందన్నారు.
Raitu Nestam : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 4.07 కోట్లు విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించి వాటికి పరిష్కారం దిశగా సూచనలు ఇస్తారన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో భాగంగా జిల్లాలోని ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా అన్ని రైతు వేదికలకు సేవలను విస్తరించనున్నారు. 31 రైతు వేదికల్లో గ్రౌండింగ్ చేసి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్ పూర్తి చేస్తారు. కొత్త టెక్నాలజీ ద్వారా రైతులకు సాగులో సాయపడటంతో పాటు, అధికారులకు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
రైతు వేదికల్లో వచ్చే కొత్త టెక్నాలజీతో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి, సాగుపై సలహాలు ఇవ్వనున్నారు. పంటల చీడ పీడలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త స్కీములపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వివిధ శాఖల మంత్రులు కూడా నేరుగా రైతులతో మాట్లాడే వీలు కలుగుతుంది. రైతులు కూడా తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలిపే అవకాశం కల్పిస్తారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాలు, వివిధ స్కీములు వివరించే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు పశుసంవర్థక శాఖ వెటర్నరీ డాక్టర్లు రైతులకు సలహాలు అందించనున్నారు. రైతు వేదికల్లోని టెక్నాలజీ ద్వారా రైతులతో నేరుగా సమావేశమై ముఖాముఖిగా ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించుకునే వీలు కల్పిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.