JPS Regularisation: జేపీఎస్‌లకు బిగ్ గుడ్‌న్యూస్! ఉద్యోగాల రెగ్యులరైజ్‌కు కేసీఆర్ నిర్ణయం
విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
KCR Good News to Junior Panchayat Secretaries: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల (Junior Panchayat Secretaries) పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి ఆఫీసర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయనున్నారు. జిల్లా స్థాయి కమిటిల ద్వారా పంపిన ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపనుంది. రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (Junior Panchayat Secretaries) జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (KCR) ఆదేశించారు.
కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం కఠిన నిర్ణయం
కొద్ది రోజుల క్రితం వరకూ జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు (Junior Panchayat Secretaries) ప్రస్తుతం సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి అంశంలో తెలంగాణ ప్రభుత్వం మే 12న కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరైన వారి లిస్టును మధ్యాహ్నంలోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ఇక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ నిర్ణయంతో జేపీఎస్‌ల సమ్మె విరమణ
మొత్తానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (Junior Panchayat Secretaries) సమ్మె విరమించినట్లుగా మే 14న ప్రకటించారు. తమ ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16 రోజులుగా సమ్మె చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి వార్నింగ్ ఇవ్వడంతో సమ్మె విరమించాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్ ను పట్టించుకోకపోగా, ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొందరు జేపీఎస్ లు తిరిగి విధులలో చేరారు. అన్ని జిల్లాల సంఘాల నేతలు విధుల్లో తిరిగి చేరదామని, ప్రభుత్వాన్ని మరోసారి తమ సమస్యను పరిష్కరించమని కోరదామని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Telangana Formation Day Logo: తెలంగాణ దశాబ్ది వేడుకల లోగో విడుదల - ఆవిష్కరించిన కేసీఆర్