Kishan Reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం... డిసెంబర్ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. డిసెంబర్ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దు అవ్వడం తన జీవితంలో మర్చిపోలేని విషయమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించానని తెలిపారు. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 75 వారాలపాటు జరగనున్న ఉత్సవాలను విజయవంతం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి
కరోనా సమయంలో హోంశాఖ నేతృత్వంలో నిర్వహించిన కంట్రోల్ రూం బాధ్యతలు చూశానని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరిపామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనపై నమ్మకం ఉంచి మూడు శాఖలు అప్పగించిన ప్రధాని మోదీకి రుణపడి ఉంటానన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తుందన్న ఆయన ఆ నిధులను ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. దేశంలో 3,700 ప్రాచీన కట్టడాలు ఉన్నాయని వాటిలో 40 కట్టడాలకు యూనెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. రామప్పకు యూనెస్కో గుర్తింపు రావడం హర్షణీయమన్నారు.
Also Read: Three Capital Govt Plan : మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందా.. ? వ్యూహం మార్చిందా..?
రామప్పకు గుర్తింపు హర్షణీయం
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గోల్కొండ అభివృద్ధికి జీఎంఆర్ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 75 పురాతన కట్టడాలు, చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబర్ నుంచి దేఖో అప్‌నా దేశ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Disha Law : "దిశ" చుట్టూ ఏపీ రాజకీయం ! ఆ చట్టం ఉందా ? లేదా ?
75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
ఆజాదీకా అమృత్ వర్ష్ పేరుతో 75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామన్న ఆయన... అప్పటికి దేశాభివృద్ధిపై సగర్వంగా చెప్పుకోవాలన్నది ప్రధాని ఆకాంక్ష అన్నారు. ప్రతీ వ్యాపార సంస్థ ఆజాదీకా అమృత్ మహోత్సవం లోగో పెట్టుకోవాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామాల మ్యాపింగ్ చేయాలన్నారు.