BRS News : హైడ్రామా మధ్య కేసీఆర్ సమీక్షకు ఆరూరి రమేష్ - బీజేపీలో చేరకుండా ఆగిపోతారా ?
Telangana : ఆరూరి రమేష్ బీజేపీలో చేరకుండా ఆపేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అయితే ఆరూరి రమేష్ నిర్ణయం ఏమిటన్నదనిపై ఇంకా స్పష్టత లేదు.
![BRS News : హైడ్రామా మధ్య కేసీఆర్ సమీక్షకు ఆరూరి రమేష్ - బీజేపీలో చేరకుండా ఆగిపోతారా ? BRS leaders tried to stop Aruri Ramesh from joining BJP BRS News : హైడ్రామా మధ్య కేసీఆర్ సమీక్షకు ఆరూరి రమేష్ - బీజేపీలో చేరకుండా ఆగిపోతారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/0bdc5799b426a0b3c1192a5c513551551710333888646228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS leaders tried to stop Aruri Ramesh from joining BJP : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం.. వెంటనే ఆయనను ఆపేందుకు బీఆర్ఎస్ మఖ్య నేతలంతా ప్రయత్నాలు చేయడంతో రోజంతా హైడ్రామా నడిచింది. మంగళవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో ఆరూరి రమేష్ భేటీ అయ్యారన్న ప్రచారం జరిగింది. బీజేపీ నేతలతో ఆయన కలిసి కనిపించారు. బుధవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీ తరపున వరంగల్ లోక్ సభకు పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే అసలు హైడ్రామా అప్పుడే ప్రారంభమయింది.
ఆరూరి రమేష్ ను రాజీనామా ప్రకటించనీయకుండా హైదరాబాద్ తీసుకెళ్లిన ఎర్రబెల్లి
ఆరూరి రమేష్ ఇంటికి ప్రెస్ మీట్ కంటే ముందే ఎర్రబెల్లి దయాకర్ రావు , బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు వచ్చారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడించారు. కేసీఆర్‌తో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష ఉందని హాజరు కావాలని సూచించారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడనీయకుండా ఆరూరిని.. నేతలంతా కలిసి కారులో హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.
పెంబర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు లాగేయడంతో చిరిగిపోయిన ఆరూరి రమేష్ చొక్కా
ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు పెంబర్తి వద్ద అడ్డుకున్నాయి. కారు ఆపి.. ఆరూరి రమష్‌ను తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు. అయితే బీఆర్‌ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో.. జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది. ఎలాగోలా వాహనం నుంచి బయటకు వచ్చిన ఆరూరిని .. ఇరు వర్గాలు తమ తమ నేతలకు ఫోన్లు కలిపి కోరుతున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తాను హైదారాబాద్ సమావేశానికి ఇష్టపూర్వకంగానే వెళ్తున్నానని చెప్పారు.
బీఆర్ఎస్ తరపున లోక్ సభ టిక్కెట్ ఇస్తామని పార్టీ మారొద్దంటున్న హైకమాండ్
తర్వాత ఆరూరి రమేష్ ను హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి తీసుకు వచ్చారు. అక్కడ వరంగల్ జిల్లా నేతలతో లోక్‌సభ నియోజకర్గంపై సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఆరూరి రమష్‌కే సీటు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఆరూరి రమేష్ పార్టీలో ఉంటారా లేదా అన్నది తేల్చి చెప్పడం లేదు. అందుకే ప్రకటన ప్రస్తుానికి నిలిపివేశారని అంటున్నారు. ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతానని కిషన్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరాలనుకున్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీ తరపున బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)