KCR Birth Day Celebrations: తెలంగాణలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు - పారా గ్లైడింగ్ చేసిన అభిమాని
KCR Birth Day Celebrations: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్ కటింగ్స్ తో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
KCR Birth Day Celebrations: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ.. సందడి చేస్తున్నారు. ఎక్కడికక్కడ కేక్ కట్ చేస్తూ.. పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి బీఆర్ఎస్ జెండా చేత పట్టుకొని ఓ అభిమాని పారా గ్లైడింగ్ చేశాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ కారణజన్ముడిగా, చిరస్మరణీయుడుగా, ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా, మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ కారుల మధ్య జన్మదిన వేడుకలు నివహిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఈ మట్టి బిడ్డ కావడం జిల్లాకు గర్వకారణం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని, కానే కాదు, రానే రాదు అన్న తెలంగణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే సాధించగలిగారని తెలిపారు. రైతు బంధు, రైతుబీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీష్ రావు వివరించారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కేసీఆర్ కృషి చేశారని వివరించారు. 65 వేల కోట్లు రైతు బంధు కోసం బడ్జెట్‌లో పెట్టారని... అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణను కేసీఆర్ ముందుచాడని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం అని, రాష్ట్ర ప్రజల పక్షాన కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీవీ మార్గ్ లోని థ్రిల్ సిటీలో కేసీఆర్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలోనే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే.కేశవ రావు, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె ఆలయానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజశ్యామల పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజు అభివృద్ధి చెందుతుందని ఆమె వివరించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కీసరలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సీఎం పేరు మీద అభిషేకం, ప్రత్యేక పూజల జరిపిస్తున్నారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్కులో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు మొక్కలు నాటారు.