Telangana News: రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
BRS: కొండా సురేఖ ఇష్యూలో బీఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గన్నులు పెట్టి బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్న రోహిణ్ రెడ్డి, సుమంత్‌లపై కేసులు పెట్టాలని కోరింది.

BRS files complaint with police in Konda Surekha issue: తెలంగాణలో కాంగ్రెస్ లో ఏర్పడిన కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంపై గన్నులు పెట్టి బెదిరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిణ్ రెడ్డి, సుమంత్‌లపై కేసులు పెట్టాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ వెల్లడించిన తీవ్ర ఆరోపణల ఆధారంగా, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి , కొండా సురేఖ మాజీ OSD ఎన్. సుమంత్‌లపై తక్షణం FIR నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. తుపాకీతో బెదిరింపులు, అవినీతి , సాక్ష్యాల తారుమారు వంటి తీవ్ర ఆరోపణలు చేశారు.
అక్టోబర్ 15న మంత్రి కొండా సురేఖ గారి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న సుమంత్ ను అరెస్టు చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. ఆ రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వారంట్ లేకుండా మంత్రి ఇంటికి వెళ్లారు. అంతకు ముందు రోజే పదవి నుంచి తప్పించిన మాజీ OSD ఎన్. సుమంత్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను తుపాకీతో బెదిరించి డబ్బు వసూలు చేసినట్లుగా సుమంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో జరిగినట్లు ప్రచారం జరిగింది.
సుమంత్ ను అరెస్టు చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కొండా సురేఖ, ఆమె కుమార్తె.. అతన్ని వేరే వాహనంలో తన వెంట తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో సుష్మిత పటేల్ మీడియా ముందు చేసిన సీఎం రేవంత్ పై ఆరోపణలు చేశారు. " ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులతో సమావేశంలో ఉన్నారు. తుపాకీ ముఖ్యమంత్రినే రోహిణ్ రెడ్డికి ఇచ్చారు " అని ఆరోపించారు. తన తండ్రి కొండా మురళిని అరెస్టు చేయడానికి.. తల్లి మంత్రి పదవిని తీసేయడానికి చేసిన కుట్రగా ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సలహాదారు వెం నరేందర్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ MLA కడియం శ్రీహరి – మా కుటుంబాన్ని అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోరోపించింది.
ఈ సంఘటనకు ముందు ఆ రోజు సుమంత్‌ను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. టాస్క్ ఫోర్స్ బృందం సుమంత్‌ను అరెస్టు చేయాలని ప్రయత్నించినప్పుడు, సుమంత్‌తో కలిసి సురేఖ కారులో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. BRS నేతలు ఈ ఆరోపణలు ప్రధాన మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రచారమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు BNSS 2023 చట్టంలోని సెక్షన్ 173(1) కింద సుప్రీం కోర్టు 'లలిత కుమారి' తీర్పు ప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. పోలీసులు ఇంకా కేసు నమోదుపై నిర్ణయం తీసుకోలేదు.





















