(Source: ECI/ABP News/ABP Majha)
Banda Prakash: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండా ప్రకాశ్, ఏకగ్రీవంగా ఎన్నిక
విద్యార్థి నాయకుడిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన బండ ప్రకాష్, తన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
Telangana Legislative Council New Deputy Chairman: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండా ప్రకాష్ (Banda Prakash) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆయన్ను స్వయంగా తీసుకెళ్లి ఛైర్మన్ సీట్లో కూర్చొబెట్టారు. బండ ప్రకాష్ (Banda Prakash) ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన బండ ప్రకాష్ (Banda Prakash), తన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రాజ్యసభ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని తాను కోరానని అన్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాష్ 2021లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికైన సంగతి తెలిసిందే.
బండా ప్రకాష్ (Banda Prakash) ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2021 నవంబర్ 16న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బండ ప్రకాష్ ఎమ్మెల్సీ పదవీ కాలం 2021 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఉండనుంది.
బండ ప్రకాష్ 1954 ఫిబ్రవరి 18న వరంగల్ లో సత్యనారాయణ, శకుంతల దంపతులకు జన్మించారు. ఆయన కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ నుండి 1996లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన భార్య పేరు అనిత, ఆమె వృత్తిరీత్యా టీచర్, సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.
రాజకీయాల్లోకి ఇలా
బండ ప్రకాష్ 1981 నుండి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా పని చేశారు. ఆయన 1981 నుండి 1984 వరకు వరంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1981 నుండి 1986 వరకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
బండ ప్రకాష్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. ఈ ఎన్నికలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లు పోలయ్యాయి. ఆయన 2018 మార్చి 23న టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బండ ప్రకాష్, 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు & సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019 జూన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాష్ నియమితులయ్యాడు.
బండ ప్రకాష్ తెలంగాణ శాసన మండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికై, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అయన పేరును 2023 ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.