News
News
X

Breaking News Live Telugu Updates: యూకే ప్రధానమంత్రి రేసులో మరో అడుగు ముందుకేసిన రిషి సునక్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
UK PM Race: యూకే ప్రధానమంత్రి రేసులో మరో అడుగు ముందుకేసిన రిషి సునక్‌

బ్రిటీష్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ మొదటి రౌండ్ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు సాధించారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధానిగా ఎన్నికయ్యేందుకు మరో అడుగు పడింది. ఈ రౌండ్‌లో ఇద్దరు అభ్యర్థులు ఎలిమినేట్‌ అయ్యారు. యూకే ప్రధాన మంత్రి రేస్‌లో ఉన్న రిషికి ఎన్నికల మొదటి రౌండ్‌లో 88 ఓట్లు వచ్చాయి. కన్జర్వేటివ్ సభ్యుల పోల్స్‌లో 67 ఓట్లతో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, 50 ఓట్లతో విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్... సునక్ తర్వాత స్థానంలో ఉన్నారు. 

బూస్టర్ డోస్

దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ డోసు పంపిణీ చేయనుంది.

Ramagundam: రామగుండంలో నిలిచిన ఎరువుల ఉత్పత్తి

భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా, బ్యాగింగ్, కన్వేయర్ యూనిట్ విభాగంలో ఈదురు గాలులకు ప్లాంట్ పై కప్పు దెబ్బతినడంతో పాటు 80 వేల యూరియా బస్తాల నీరు ధ్వంసమైంది. దీంతో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసింది. ప్లాంట్ పునర్నిర్మాణంలో నాసిరకం పని జరిగిందని, ఈ ఘటన వెనుక అవినీతి జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభం కాకముందు నుండి పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది

TS EAMCET 2022 Exam Date: తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు వాయిదా, ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథం

TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. సొంతూళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవడం కష్టమేనని పరీక్షలు వాయిదా వేస్తారని అంతా భావించారు. తెలంగాణ ఎంసెట్ 2022 అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షా తేదీలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ విభాగం పరీక్షా తేదీలలో ఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

Kukatpally Theft: కూకట్ పల్లిలో వాచ్‌మెన్ చోరీ, కాపు కాస్తున్న ఇంట్లోనే

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది. ఇంటికి వాచ్మెన్ గా పని చేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలీ అదే ఇంటికి కన్నం వేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్ రావు ఇంట్లో ఎనిమిది నెలల క్రితం చక్రధర్ అనే నేపాలీ తన భార్య సీత, మూడేళ్ళ కుమారుడితో కలిసి వాచ్మెన్ గా చేరాడు. అప్పటి నుండి నమ్మకంగా పని చేస్తున్న వారు ఈ నెల 6వ తేదీన తమ బంధువుల వద్దకు వెళ్తున్నామని నాగపూర్ వెళ్ళి, తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు ఓ గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్ రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ ఫంక్షనుకు వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన చక్రధర్, గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి 30 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ఆటోలో కుటుంబంతో సహా పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన దామోదర్ రావు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సిసి కెమెరాల ఆధారంగా దొంగలు లక్డీకాపూల్ వరకు వెళ్లారని గుర్తించారు. మాదాపూర్ డిసిపి అధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.

Nellore Earth Quake: నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఉదయం 5.20గంటలకు భూకంపం వచ్చింది. 3 సెకన్లపాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇళ్లలోని వస్తువులు కదిలి కిందపడిపోయాయి. దీంతో ప్రజలు భూకంపంగా అనుమానించారు. దాదాపుగా అందరికీ ఇదే అనుభవం ఎదురుకావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు చెబుతున్నారు గ్రామస్తులు. గతంలో కూడా ఓసారి ఇలాగే మర్రిపాడు మండలంలో భూకంపం వచ్చింది. ఇప్పుడు మరోసారి భూమి కంపించడంతో ప్రజలు భయపడుతున్నారు.

Nizamabad: నిజామాబాద్‌లోనూ ఆన్ లైన్ లోన్ యాప్ మోసాలు

నిజామాబాద్ జిల్లాలో స్మాల్ క్రెడిట్ యాప్ మోసాలు పెరిగిపోయాయి. వారి వేధింపులు శ్రుతి మించుతున్నాయి. రుణాలు ఇస్తూ అధిక డబ్బుల వసూళ్లకు  పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు గత నెల 12వ తేదీన స్మాల్ క్రెడిట్ అప్ ద్వారా 4,500 రూపాయల రుణం తీసుకున్నాడు. ఏడు రోజుల్లో తీసుకున్న రుణం చెల్లించాడు. మళ్ళీ డబ్బులు కట్టాలని వేధించడంతో అదనంగా మరో 4వేలు చెల్లించాడు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని ఫోన్లు చేస్తూ చీట్ చేస్తున్నారు. కాంటాక్ట్ లిస్టులోని కొందరికి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వేధింపులు తాళలేక ఏడపల్లీ పోలీస్ స్టేషన్లో  యువకుడు ఫిర్యాదు చేశాడు.

Ellampalli Project: నిండు కుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు

మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 8.50 లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 8.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.7168 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Srirama Sagar: శ్రీరామ సాగర్‌కుపోటెత్తుతున్న వరద నీరు

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 2,35,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో 30 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 73 టీఎంసీలు నిల్వ ఉంది. జెన్ కోకి 3 వేల క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్జుల నీటిని విడుదల చేస్తున్నారు.

Background

ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్ప పీడనం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుందని, మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో రెండు రెండులు భారీ వర్ష సూచన ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం సైతం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడనం, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి.

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత ఐదు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాళపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.