Viral News: కప్పలు, పక్షులను కాదండోయ్, ఏకంగా కోతిని మింగేసిన కొండ చిలువ!
Viral News: పాములకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూసుంటాం. కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ వీడియో. ఎందుకంటే ఓ కొండచిలువ కోతిని మింగేసింది. ఏంటీ కోతా అనిపిస్తోంది. అవునండీ ఓ పాము కోతిని మింగేసింది.
Viral News: కప్పలు, పురుగులు, ఎలుకలు, పక్షులు, చిన్న చిన్న కోడి పిల్లలను పాములు మింగేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ కొండచిలువ మాత్రం కోతిని మింగేసింది. వినడానికి ఇది చాలా వింతగా ఉన్నా, ఇది నిజం.
అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంట పొలాల మధ్య శనివారం కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు. ప్రతిరోజూ లాగే పంట పొలాలకు వెళ్లిన రైతులకు ఓ చెట్టు వద్ద కోతుల మంద అరుస్తూ కనిపించింది. అయితే అవి అరుస్తూ మీద మీదకు రావడం గమనించిన అన్నదాతలు.. వాటిని దూరంగా వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చెట్టు వద్దకు వెళ్తూ.. రాళ్ల, కర్రలు చేత పట్టుకొని కేకలు వేస్తూ వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన రైతులు ఓ ఘటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు ఒక్కరు చూడగా.. అందర్నీ పిలిచి ఆ వింతను చూపించారు.
అక్కడ ఓ పెద్ద కోతిని కొండ చిలువ మింగేస్తోంది. ఆ ఘటన చూసి అంతా చలిపోయారు. అంత పెద్ద కోతిని అది అమాంతంగా మిగేస్తుంటే ఆశ్చర్యపోయారు. కప్పలు, పక్షలు, కోడి పిల్లలను మింగడం చూశాం కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు, వినాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇది అందరికీ తెలియడంతో ఊర్లోవారంతా అక్కడి భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే పెద్ద కోతిని మింగలేక కొండ చిలువ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైనుంచి వచ్చిన వరదలతో కొండ చిలువ కొట్టుకు వచ్చి ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పెద్దపులి సంచారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం గత కొద్దిరోజుల నుండి అలజడి సృష్టిస్తోంది. ఆదిలాబాద్ మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికి పదుల సంఖ్యలో పశువులపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తు పాదముద్రలను సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పులి గురించి వారికున్న సమాచారం మేరకు గ్రామాల్లో డప్పు చాటింపుతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్ పరిసర అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే కాగజ్‌నగర్ మండలం కొసిని, రేగలగూడ, అనుకోడ సమీప అటవి ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి దాడి చేసింది. పులిదాడిలో రెండు పశువులు మృత్యువాతపడ్డాయి. గత నెలలో కూడా చింతలమానేపల్లి, పెంచికల్ పేట్ మండలాల్లోను పులి రెండు పశువులను హతమార్చింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ కాగజ్‌నగర్ అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తు అలజడి సృష్టిస్తోంది. కొసిని రేగలగూడ అటవి ప్రాంతంలో భీమేష్ అనే పశువుల కాపరి పశువులను కాస్తుండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఆవుపై పులి దాడి చేయడాన్ని పశువుల కాపరి భీమేష్ కళ్ళారా చూశానని చెప్పాడు. పక్కనున్న వారిని పిలిచి అరుపులు కేకలు వేయడంతో పులి కాసేపటికి ఆవును వదిలి అక్కడ నుండి సమీప అటవి ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని చెప్పాడు.
కాపరి తమ గ్రామస్తులకు పశువుల యజమానికి సమాచారం అందించాడు. పులి దాడిలో గాయపడ్డ ఆవును పశువైద్యశాలకు తీసుకెళ్ళి వైద్యం అందించారు. చికిత్స పొందిన ఆవు శుక్రవారం రాత్రి మృతిచెందింది. తిరిగి మరుసటి రోజు కాగజ్‌నగర్ మండలంలోని అనుకొడ అటవి ప్రాంతంలో మళ్ళీ పశువుల మందపై పులి దాడి చేసింది. ఓ లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. ఈ విషయమై స్థానికులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించగా పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తు పులి పాదముద్రలను సేకరించారు. సమీప గ్రామాల్లో ఉండే ప్రజలు రైతులు, పశువుల కాపర్లు తమ పశువులను దగ్గరలోనే మేపుకొవాలని అటవి ప్రాంతం వైపు వెళ్ళొద్దని, పులిపట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.