Guvvala Balaraju: ‘నీకు వందే ఎక్కువ వంద కోట్లా?’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానకర ఫోన్ కాల్!
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అవమానకంగా మాట్లాడాడు. అతను ముస్తాబాద్ మండలానికి చెందిన వ్యక్తిగా తేల్చారు.
ఎమ్మెల్యేలకు కొంత మంది ఆగంతుకులు ఫోన్ చేసి మీరూ రాజీనామా చేయండని, చేస్తే వచ్చే ఉప ఎన్నిక ద్వారా మా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నట్లుగా ఈ మధ్య చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యేకు కూడా అలాంటి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఈ కాల్ వచ్చింది. ఆయన ఇటీవల ఫామ్ హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంలో కూడా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు కూడా ఉన్నారు. వారు బీజేపీ ఆఫర్ చేసిన రూ.100 కోట్లను కాదని, వారు నీతి నిజాయతీకే ప్రాధాన్యం ఇచ్చారని అక్టోబరు 30న సీఎం కేసీఆర్ చండూరు సభలో ఆకాశానికెత్తిన సంగతి తెలిసిందే.
అలాంటిది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అవమానకంగా మాట్లాడాడు. అతను ముస్తాబాద్ మండలానికి చెందిన వ్యక్తిగా తేల్చారు. మండలంలోని ఆవునూర్ గ్రామానికి చెందిన క్రాంతి కుమార్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో సెల్ ఫొన్‌లో మాట్లాడాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ఫోన్ లో మాట్లాడిన క్రాంతి కుమార్.. ఆయనను ఘోరంగా అవమానించాడు. ‘‘నిన్ను రూ.100 కోట్లకు కాదు రూ.100 కి కూడా ఎవరూ కొనరు’’ అంటూ ఎద్దేవా చేశాడు. కొద్దిసేపు వారి మధ్య సంభాషణ ఇలానే కొనసాగింది. ఇప్పుడు ఆ కాల్ రికార్డ్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారింది.