Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Lagacharla attack case | వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలున్నాయి.
BRS leader Patnam Narendar Reddy in Lagacharla attack case | కొడంగల్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ సహా అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని నేటి ఉదయం అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ నేతను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డిక ఈనెల 27 వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. లగచర్ల కేసులో అరెస్టైన పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
ఈ కేసులో మొదట దాదాపు 60 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం 50 మందిని రైతులను వదిలేసిన పోలీసులు 16 మందిని రిమాండ్ కు తరలించారు. అధికారులపై దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో పోలీసులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డిని, ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడు సహా నలుగుర్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు నవంబర్ 11న వెళ్లారు. తొలుత లగచర్ల గ్రామ శివార్లలో గ్రామ సభ ఏర్పాటు చేశారు... అనంతరం ఈ కేసులో ఏ1గా ఉన్న సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్ సహా ఇతర అధికారులను ఒప్పించి గ్రామంలోకి తీసుకువెళ్లాడు. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మీరు ఓసారి వచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఉన్నతాధికారులను సురేష్ నమ్మించి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా, కలెక్టర్ అక్కడికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. లగచర్ల ప్రజలు ఒక్కసారిగా కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారు, కలెక్టర్ కారు దిగి వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో పలు సెక్షన్ల కింద లగచర్లలో దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులపై దాడికి ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు.
డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఏ1గా భోగమోని సురేశ్‌ను చేర్చుతూ మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. మంగళవారం 16 మందిని అరెస్ట్ చేయగా, బుధవారం నాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మరో నలుగుర్ని అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. గ్రామస్తులు, రైతుల రాళ్లదాడిలో కలెక్టర్, కొందరు అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరగిందని, కానీ దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.