TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
TTD : టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మార్కెటింగ్ జీఎంను సిట్ అరెస్టు చేసింది. కల్తీ అని తెలిసినా కొనుగోళ్లకు ఆమోదం తెలిపినట్లుగా గుర్తించారు.

SIT arrests Marketing GM in TTD adulterated ghee case: తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ ప్రసాద తయారీకి వాడిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలక అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ను ఈరోజు అరెస్టు చేశారు. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న తో కలిసి కల్తీ నెయ్యి సరఫరాలో కుట్రలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుతో కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది.
చిన్న అప్పన్నతో కలిసి సుబ్రహ్మణ్యం కుట్ర చేశారని తేల్చిన సిట్
సుబ్రహ్మణ్యం, టీటీడీ కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ కాలంలో, లడ్డూ తయారీకి 68.17 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చారు. ఈ నకిలీ నెయ్యి విలువ సుమారు రూ. 250-251 కోట్లు. కిలోకు రూ. 25 కమిషన్ తీసుకుని, చిన్న అప్పన్న తో కలిసి కాంట్రాక్టర్లను ప్రోత్సహించాడని తేలింది.
అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన సిట్
సిట్ అధికారులు సుబ్రహ్మణ్యంను గురువారం ఉదయం తిరుపతిలో అరెస్టు చేసి, రుయా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించారు. త్వరలోనే నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కల్తీ నెయ్యి సరఫరా ప్రక్రియలో ఉన్న అవినీతి డీల్స్‌లో సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించాడని సిట్ వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం 2024 సెప్టెంబర్‌లో బయటపడింది. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదుతో తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత సుప్రీంకోర్టు విచారణకు ప్రత్యేక సిట్ ను నియమిచింది.
త్వరలో అసలు సూత్రధారులను అరెస్టు చేసే అవకాశం
బోలేబాబా డెయిరీ పాలు కొనుగోలు చేయకుండా రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసి సరఫరా చేసింది. 2022లో బ్లాక్‌లిస్ట్ అయినా, మార్గాలు మార్చి సరఫరా కొనసాగింది. మొత్తం 68 లక్షల కేజీలు, రూ. 251 కోట్ల మోసం చేసింది. ఏఆర్ డెయిరీ, మాల్‌గంగా వంటి సంస్థలు కూడా ఈ దందాలో పాలు పంచుకున్నాయి. సిట్ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన మోసం అని చెబుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్టు అయ్యారు. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న, ఢిల్లీ రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధ్, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ మరియు ఇతర కాంట్రాక్టర్లు అరెస్ట్ అయ్యారు. మొదటి సారి టీటీడీ అధికారిని అరెస్టు చేశారు.





















