Amaravati farmers: అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
CM Chandrababu Naidu: అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రైతులు తమ సమస్యలను వివరించారు.

CM Chandrababu Naidu meets with Amaravati farmers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎ చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి రాజధాని భూములు ఇచ్చిన రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని కోసం తమ భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, ఎసైన్డ్ ల్యాండ్స్ విషయాలు ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. అలాగే, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, TDR బాండ్లు వంటి అంశాలపైనా చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ముందుగా ఏర్పాటు చేసిన కమిటీని 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చేయాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్, కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆలస్యాల వల్ల రైతుల ఆందోళనలు తగ్గించేందుకు స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 6 నెలల్లో అన్ని పెండింగ్ ఇష్యూలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. రైతులు ప్రధానంగా కొన్ని సమస్యలను ప్రస్తావిస్తున్నారు. గ్రామ కంఠాల సమస్య ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే పది పదిహేను రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ కూటమి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికి సమస్య అలాగే ఉందని రైతులు అంటున్నారు.
CRDA అధికారులు మహిళలు, చిన్నకారు రైతులను కించపరుస్తున్నారని చెబుతున్నారు. భూములు ఇచ్చి ఉద్యమాలు చేసిన తమతో వారి వ్యవహార శైలి ఏమాత్రం బాగుండడం లేదని అంటున్నారు. అమరావతికి 29 గ్రామాల ప్రజలు భూములు ఇవ్వగా ఆయా గ్రామాల్లో ఇంకా కొన్ని పొలాల భూ సమీకరణ జరగాల్సి ఉంది. భూములు ఇచ్చిన రైతులకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా భూములు ఇవ్వని 1250 ఎకరాల్లో రోడ్లు వేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దానితో అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు.
2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి అమరావతి జేఏసీ 14 సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. అయితే వాటిలో నెరవేరింది మాత్రం కేవలం ఒక్కటే. అది అమరావతిలో ఉన్న అసైండ్ భూములకు సంబంధించి ఇచ్చే నష్ట పరిహారంపై ఇప్పట్లో ఏమి తేల్చలేదని స్పష్టత రైతులకు ఇచ్చేసింది ప్రభుత్వం. మిగిలిన 12 సమస్యలపై ప్రభుత్వం గానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఏమి తేల్చకుండా ఉండడం వల్ల రైతులు అసంతృప్తికి గురవుతున్నారు. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.





















