WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్, జాబ్ ఆఫర్స్ పేరుతో యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు.
వాట్సాప్ ను అడ్డాగా చేసుకుని సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. డబ్బుతో పాటు విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. గత కొంత కాలంగా వాట్సాప్ వేదికగా జరుగుతున్నమోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇంటర్నేషనల్ కాల్స్ తో పాటు జాబ్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను సైబర్ మోసగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. దేశంలోని చాలా మంది యువతకు జాబ్ పేరిట వల విసురుతున్నారు. వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ ఉద్యోగ ఆఫర్లతో పాటు మోసాలకు తెరలేపుతున్నారు. హైరెక్ట్ ఇటీవలి నివేదిక ప్రకారం, చాట్-ఆధారిత డైరెక్ట్ హైరింగ్ ప్లాట్ ఫారమ్ లో, దేశంలోని దాదాపు 56% మంది ఉద్యోగార్ధులు తమ ఉద్యోగ వేటలో జాబ్ స్కామ్‌ల ద్వారా ప్రభావితమైనట్లు వెల్లడించింది. వీరిలో 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లే కావడం విశేషం. ఈ స్కామర్లు అధిక జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వారి నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు.
వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్ల మోసాలు
కొంతమంది స్కామర్‌లు వాట్సాప్‌లో లేదంటే SMS ద్వారా టార్గెటెడ్ టెక్స్ట్ మెసేజ్ లను పంపుతున్నారు. ఉదాహరణకు, “ప్రియమైన మీరు మా ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్యారు. వేతనం రోజుకు రూ. 8000. వివరాల గురించి తెలుసుకోవడానికి దయచేసి సంప్రదించండి: http://wa.me/9191XXXXXX SSBO.” అని పంపిస్తున్నారు. ఆదమరిచి లింక్ క్లిక్ చేస్తే ఫోన్ లోని సమాచారం అంతా స్కామర్ల దగ్గరికి చేరిపోతుంది. వాట్సాప్ లింక్‌ల ద్వారా స్కామర్‌లు ఉద్యోగాన్ని అందిస్తామని చెప్తారు. ఆపై లింక్ క్లిక్ చేయమని చెప్తారు. వాటిని క్లిక్ చేస్తే డబ్బు, డేటా రెండింటినీ కొట్టేస్తారు. వాట్సాప్ లో అత్యంత ప్రమాదకరమైన స్కామ్ తెలియని అంతర్జాతీయ నంబర్ నుంచి వీడియో కాల్‌ను తీసుకోవడం. మీరు కాల్‌కు సమాధానం ఇచ్చిన తర్వాత, మరొక వైపు ఉన్న సైబర్ నేరస్తులు ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతారు. ఇప్పటికే అంతర్జాతీయ నంబర్ల ద్వారా వాట్సాప్ జాబ్ స్కామ్‌ల గురించి పోలీసులకు వందలాది ఫిర్యాదులు అందాయి.
జాబ్ స్కామ్ ల నుంచి ఎలా రక్షించుకోవాలంటే?
ఇటీవల, పోలీసులు WhatsApp వినియోగదారుల కోసం కొన్ని భద్రతా సూచనలు విడుదల చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం నిజమైన రిక్రూటర్ ఎవరూ డబ్బును డిమాండ్ చేయరని గుర్తుంచుకోవాలి.
2. స్కామర్‌లు నకిలీ ఇమెయిల్ ఖాతాలు, లోగోలను ఉపయోగించి నిజమైన జాబ్ కన్సల్టెన్సీ సంస్థల మాదిరిగానే నటిస్తారు. మీరు ఏదైనా చెల్లింపు చేసే ముందు వివరాలను ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి.
3. ముందుగా, మీరు ఆన్‌లైన్ ఫోరమ్‌లలో పేర్కొన్న సంస్థ గురించి వివరాలను తెలుసుకోవాలి. ఇరతులు వారి మోసపూరిత కార్యకలాపాల గురించి కామెంట్స్ చేసినట్లైతే వారు మోసగాళ్లు కావచ్చని భావించాలి.
4. స్పష్టత కోసం మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన ఫోన్ నెంబర్లతో సంప్రదించి కన్ఫార్మ్ చేసుకోవాలి.
5. అంతర్జాతీయ కాల్‌లను స్వీకరిస్తున్నట్లయితే, స్పామ్ కాల్‌లను రిపోర్టు చేయడంతో పాటు బ్లాక్ చేయడం ఉత్తమం.
Read Also: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!