Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే లక్ష్యంగా కొత్త మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ తో పాటు పాస్ వర్డ్స్, కీలక సమాచారాన్ని దొంగిలిస్తోంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేసుకుని ‘డామ్’ అనే మాల్వేర్ తీవ్ర ముప్పు కలిగిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులకు సంబంధించిన కీలకమైన సమాచారంతో పాటు కాల్ రికార్డింగ్స్, పాస్ వర్డ్స్ మార్చడం చేస్తోందని తెలిపింది. ఈ మేరకు ‘డామ్’ మాల్వేర్ పట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అడ్వైజరీని జారీ చేసింది.
‘డామ్’ మాల్వేర్ తో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు తీవ్ర ముప్పు
‘డామ్’ మాల్వేర్ మీ ఫోన్‌లోని కాల్ రికార్డులు, ఫోన్ నెంబర్లు, బ్రౌజింగ్ హిస్టరీ, కెమెరాను అనధికారికంగా యాక్సెస్ అందుకుంటుందని వెల్లడించింది. CERT-In అడ్వైజరీ ప్రకారం ‘డామ్’ మాల్వేర్ యాంటీ వైరస్ కు దొరకకుండా తప్పించుకుంటుదని తెలిపింది. ఈ వైరస్‌ను గుర్తించడం తొలగించడం చాలా కష్టమైన పని అని చెప్పింది. డివైజ్ ను లాక్ చేసినా ఈ మాల్వేర్ అన్‌లాక్ చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
మాల్వేర్ స్మార్ట్ ఫోన్ లోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే?
ఈ మాల్వేర్ థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ తో పాటు పలు రకాల లింకుల ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తుందని కేంద్రం తెలిపింది. పలు రకాల యాప్స్ ద్వారా కూడా వస్తున్నట్లు వెల్లడించింది. ఇది డివైజ్ లోని భద్రతా వ్యవస్థను తప్పించుకుని హాని చేసే అవకాశం ఉందని వివరించింది. ఈ వైరస్ చొరబడిన స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన కీలక సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపింది. ఈ మాల్వేర్ ఫోన్‌లోని ఫైల్‌లను దొంగిలించేందుకు AES అనే లేటెస్ట్ ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ను యూజ్ చేస్తున్నట్లు వివరించింది.
‘డామ్’ మాల్వేర్ నుంచి ఎలా కాపాడుకోవాలి?
‘డామ్’ మాల్వేర్ నుంచి రక్షణ పొందేందుకు గుర్తు తెలియని వెబ్ సైట్లకు వెళ్లకపోవడం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, తెలియని లింక్స్ ను క్లిక్ చేయకుండా అవాయిడ్ చేయడం మంచిదంటున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోని యాంటీ వైరస్ ను అప్ డేట్ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు. మొబైల్ ఫోన్ నంబర్‌లుగా కనిపించని అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. బ్యాంకుల పేరుతో వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. CERT-In సైతం పలు జాగ్రత్తను సిఫార్సు చేసింది. అధికారిక యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన వైరస్ నుంచ రక్షణ పొందవచ్చు. విశ్వసనీయత లేని వెబ్‌సైట్‌లను సందర్శించడం, అవిశ్వసనీయమైన లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి.అనవసర ఇమెయిల్‌లు, SMS పట్ల జాగ్రత్తగా ఉండాలి. మెసేజ్ ద్వారా వచ్చే లింక్స్ ను క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. వెబ్‌సైట్ డొమైన్‌ను స్పష్టంగా తెలిపే URLలపై మాత్రమే క్లిక్ చేయండి. ఖచ్చితంగా తెలియనప్పుడు స్కిప్ చేయడం మంచిది. bit.ly, tinyurl లాంటి URLల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Read Also: నెట్‌ఫ్లిక్స్, డిస్నీల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌తో పిచ్చెక్కించేస్తారట!