Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.
Tecno Phantom V Fold: టెక్నో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే టెక్నో ఫాంటం వీ ఫోల్డ్. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. అంటుటు టెస్టింగ్ ప్లాట్‌ఫాంలో 10.8 లక్షల స్కోరును సాధించింది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ ధర
ఈ ఫోన్ ధర ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.79,999కే అందించే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఫోల్డబుల్ ఇదే కావచ్చు. ఎందుకంటే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ధర రూ.లక్ష వరకు ఉంది.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.42 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ కవర్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2550 పిక్సెల్స్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఓపెన్ చేసినప్పుడు లోపల భాగంలో 7.85 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్ ఎల్టీపీవో ప్యానెల్. దీని స్క్రీన్ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 కంటే పెద్దగా ఉంది.
ఫ్లాగ్ షిప్ 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌లో కూడా ఇదే ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్ ఇందులో ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కంపెనీ ఇందులో అందించలేదు. కేవలం 15 నిమిషాల్లో 40 శాతం, 55 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ ఈ ఫోన్ ఎక్కుతుందని కంపెనీ ప్రకటించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ 2x జూమ్ కెమెరా కూడా ఉంది. 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ ఫ్రంట్ స్క్రీన్ వైపు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, లోపల స్క్రీన్ వైపు 16 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా కూడా ఉన్నాయి.
టెక్నో తన ఫాంటం ఎక్స్ సిరీస్‌లో ఇటీవలే కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే టెక్నో ఫాంటం ఎక్స్2 ప్రో. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రిట్రాక్టబుల్ పొర్టట్రెయిట్ లెన్స్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ అయింది. కర్వ్‌డ్ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఇందులో అందించడం విశేషం.
ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ రిట్రాక్టబుల్ పొర్‌ట్రెయిట్ లెన్స్, మరో 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.