Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!
రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది.
దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) ‘True 5G’ సేవలను ప్రారంభించింది. దసరా నుంచి 5 నగరాల్లో ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి 5G సేవలను ప్రారంభించినట్లు కాదని జియో వెల్లడించింది. మాస్ రోల్ అవుట్ కు మరికాస్త సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతానికి, ఎంపిక చేసిన నగరాల్లోని కొంతమంది Jio వినియోగదారులు మాత్రమే Jio 5Gని ఇస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా ఇన్విటేషన్ ద్వారా మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది.
ఇన్విటేషన్ అంటే?: జియో కంపెనీ నుంచి మిమ్మల్ని 5G సర్వీసులోకి ఆహ్వానిస్తున్నట్లు ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ అందుకున్న వెంటనే మీరు ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ అవుతారు. ఒకవేళ మీ హ్యాండ్ సెట్ 5Gకి సపోర్టు చేస్తే అదనపు ఛార్జీ లేకుండానే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.
ఒకేసారి 5G సేవలను అందుబాటులోకి తీసుకురాకుండా.. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఎందుకు అందిస్తుందనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ని పొందేందుకు ఈ రకమైన పద్దతి పాటిస్తున్నట్లు వెల్లడించింది. జియో తన 4G సేవలను విడుదల చేసే సమయంలో కూడా ఇలాగే చేసింది. అయితే, గతంలో సిమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండగా.. ఇప్పుడు మాత్రం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత Jio 4G SIM కార్డు 5G సేవలకు కూడా సపోర్టు చేస్తుంది.
Jio True 5G వెల్ కమ్ ఆఫర్
జియో ట్రయల్ 5G సేవలను ఉపయోగించాలంటే.. Jio వినియోగదారులై ఉండాలి. జియో True 5G సేవలను అందుబాటులోకి తెచ్చిన 5 నగరాల్లో మీరు ఉండాలి. అప్పుడే జియో నుంచి మీకు True 5G సేవలకు అప్ గ్రేడ్ అయ్యేలా ఇన్విటేషన్ వస్తుంది. Jio వెల్‌కమ్ ఆఫర్‌ని అందుకున్న వారు ప్రస్తుత Jio SIM లేదంటే 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే Jio true 5G సేవలును పొందేలా అప్‌గ్రేడ్ చేయబడుతుంది. జియో 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో స్వతంత్ర 5G సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ వంటి ప్రత్యర్థులు మాత్రం నాన్-స్టాండలోన్ 5Gని అందిస్తున్నారు.
ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో అన్ని హ్యాండ్ సెట్ లలో 5G సేవలతో సజావుగా పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జియో తెలిపింది. జియో ఫోన్లు అన్నీ 5Gకి మద్దతు ఇచ్చినప్పటికీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఫుషింగ్ అవుట్ చేయడం ద్వారా OEMను అన్ లాక్ చేయాలి. అప్పుడే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది. పలు టెల్కోలకు ఇది భిన్నంగా ఉంటుంది. Samsung, Apple సహా ఇతర ఫోన్ల వినియోగదారులు బ్యాండ్ రకాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది.
జియో 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు 1 Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారని Jio తెలిపింది. 5G ప్లాన్‌లు, టారిఫ్‌లు, ధర ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ సేవలను ఉచితంగానే పొందే అవకాశం ఉంది.