Moto G72: 48 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - మనదేశంలో లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో జీ72ని మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.
మోటో జీ72 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ టైమ్‌లైన్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఇందులో ఉండనున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తెలుపుతున్న దాని ప్రకారం ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను అందించనున్నారు. లేదా మరో మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. మోటో ఇందులో రెండు వేరియంట్లు అందించనుంది. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి.
మోటో జీ72 4జీ స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్‌కు ‘విక్టోరియా22’ అనే పేరు పెట్టారు. దీని మోడల్ నంబర్ XT2255-2గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు ఉన్న కెమెరాల్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన సెన్సార్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీన జరగనున్న ఈవెంట్లో మోటొరోలా ఎడ్జ్ 30 సిరీస్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి.
మోటొరోలా తన 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎక్స్30 ప్రో. ప్రపంచంలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. మోటొరోలా ఎక్స్30 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోనే మనదేశంలో ఎడ్జ్ 30 సిరీస్‌లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగానూ(సుమారు రూ.49,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.53,000) ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.73 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!