Metaverse: వర్చువల్‌గా రేప్ చేశారు.. మెటావర్స్ ‘అవతార్’లపై యువతి ఆరోపణ, స్పందించిన ఫేస్‌బుక్!
ఛీ.. మరీ ఇంత దారుణమా? చివరికి వర్చువల్.. మాయాలోకంలో కూడా అమ్మాయిలకు రక్షణ ఉండదా? మెటావర్స్‌లో యువతికి చేదు అనుభవం.
అత్యాచారం గురించి మీరు వినే ఉంటారు. కానీ, ఈ వర్చువల్ రేప్ ఏమిటనేగా మీ సందేహం? అయితే, ఇది మీరు మెటావర్స్ వర్చువల్ లైఫ్ గురించి ముందుగా తెలుసుకోవాలి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లు లేనిదే ఇప్పుడు ఏ పని జరగదు. మన జీవితంలో అవి భాగమైపోయాయి. భవిష్యత్తులో మనుషులకు రెండేసి జీవితాలు ఉంటాయి. ఒకటి వాస్తవ జీవితం, మరొకటి వర్చువల్ జీవితం. రెండోది పూర్తిగా కల్పనా ప్రపంచం. ఒకరకంగా చెప్పాలంటే అదో సాంకతిక మాయా లోకం. అదే.. మెటావర్స్ (Metaverse).
ఇప్పటికే మనం.. చాటింగ్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ద్వారా ఎక్కడో ఉన్నవాళ్లతో మాట్లాడగలుగుతున్నాం. మెటావర్స్ ద్వారా వారిని స్వయంగా కలవచ్చు కూడా. వారితో కలిసి ఆటలు కూడా ఆడవచ్చు. షికార్లు కూడా చేయొచ్చు. మీరు కాలు కదపకుండానే.. ఈ కల్పన ప్రపంచంలో విహరించవచ్చు. ఇప్పటికే మీరు పబ్‌జీ ద్వారా స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతున్నారు. భవిష్యత్తులో వారి రూపాలను కూడా మెటావర్స్‌లో చూడవచ్చు. వారు ఎంత దూరంలో ఉన్నా వర్చువల్‌గా కలుసుకోవచ్చు. సామాజిక మాధ్యమంలో ఇదో విప్లవాత్మక ముందడుగు. ఇప్పటికే చాలామంది ఈ వర్చువల్ వరల్డ్‌లో జీవించేందుకు తమ ‘అవతార్’లను రూపొందించుకున్నారు. అంటే.. వారిలాంటి రూపమే ఆ వర్చువల్ వరల్డ్‌లో జీవిస్తుందన్నమాట. ఆ అవతార్‌తో ఎవరైనా కలవచ్చు. ఇటీవలే ‘మెటా’గా పేరు మార్చుకున్న ‘ఫేస్‌బుక్’ సంస్థ సరికొత్త ఆవిష్కరణే ఈ మెటావర్స్.
ఊహించని దారుణం..: రీసెర్చ్ ఫర్ ఆ రివల్ మెటావర్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఓ భారతీయ యువతి.. ఇటీవల మెటావర్స్‌లో తన అవతార్ ద్వారా హారిజెన్ వెన్యూస్ తనిఖీ చేస్తున్న సమయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెలాగానే మెటావర్స్‌లో ఉన్న మరికొన్ని అవతార్‌లు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారంతా ఆమె అవతార్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఇటీవలే ఆమె ఓ ఆర్టికల్ ద్వారా వెల్లడించింది. వర్చువల్‌గా తనపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది. దీంతో నెటిజనులు ఇలా అత్యాచారాలు జరుగుతాయా? చివరికి వర్చువల్ ప్రపంచంలో కూడా అమ్మాయిలకు రక్షణ లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వర్చువల్ రేప్ వల్ల అమ్మాయిలకు నేరుగా హాని కలగకపోవచ్చు. కానీ, అలాంటి చర్యలు వారిని మానసికంగా కుంగదీస్తాయి. అభద్రతా భావాన్ని పెంచేస్తాయి. ఈ నేపథ్యంలో మెటావర్స్ డెవలపర్స్ తప్పకుండా ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రారంభ దశలోనే మెటావర్స్: మెటావర్స్ ప్రస్తుతం బెటా టెస్టింగ్ దశలోనే ఉంది. కన్సర్ట్స్, స్పోర్ట్స్, కామెడీ వంటివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో మెటావర్స్ సిద్ధమయ్యే వరకు ఒంటరిగా మాత్రమే సందర్శించాలని మెటా సంస్థ పేర్కొంది. అయితే, బాధితురాలు హారిజన్ వెన్యూ్స్‌ను పరిశీలించేందుకు వెళ్లింది. తాజా ఘటనతో వర్చువల్‌గా అమ్మాయిలకు అది సేఫ్ ప్లేస్ కాదని తెలుసుకుంది. ‘‘అందులో చేరిన 60 సెకన్లలోనే మూడు నుంచి నాలుగు అవతార్‌లు నాపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాయి. వర్చువల్‌గా అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఫొటోలు కూడా తీసుకున్నాయి. అందులో నాకు అబ్బాయిల మాటలే వినిపించాయి. అది నాకు చాలా భయానక అనుభవం. ఆ అవతార్‌లోని వ్యక్తుల చాలా అసభ్యకరంగా మాట్లాడారు. వెంటనే నేను హెడ్‌ఫోన్స్ తీసేశాను. అది ఒక పీడ కలలా అనిపిస్తోంది’’ అని ఆమె తెలిపింది.
మెటా స్పందన ఇది: బాధిరాలు ఎదుర్కొన్న చేదు అనుభవంపై ‘Meta’ స్పందించింది. అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, భవిష్యత్తులో ఇలాంటివి చోటుచేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ‘మెటా’ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘మీకు జరిగినది విని చింతిస్తున్నాం. మారిజన్ వెన్యూస్‌పై అందరి నుంచి పాజిటివ్ ఎక్స్‌పీయరెన్స్‌ను ఆశిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సేఫ్టీ టూల్స్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. అయితే, ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అందులో ప్రత్యేకంగా సేఫ్టీ బటన్ ఉంది. ఇతర అవతారాల నుంచి సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ప్రెస్ చేయడం ద్వారా సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే, బాధితురాలు అందులో చేరిన కొన్ని సెకన్లలోనే లైంగిక దాడి జరగడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోలేకపోయిందని తెలిసింది.