Oppo Charging Expert: ఒక్క సెకన్‌లో మొబైల్ ఫోన్ ఫుల్ ఛార్జ్? ఒప్పో ఛార్జింగ్ ఎక్స్‌పర్ట్ ఏం చెప్పారో చూడండి
లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతున్నాయి. భవిష్యత్ లో కేవలం ఒక సెకెన్ లో 100 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఉరుకుల పరుగుల జీవితం.. ఏ పనైనా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి. వెయిట్ చేసే ఓపిక లేదు. 24 గంటల సమయం సరిపోవడం లేదు. ఇదే విషయాన్ని ఒప్పో కంపెనీ సీరియస్ గా తీసుకుంది. సరికొత్త టెక్నాలజీ ద్వారా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యేలా తయారు చేసింది. మున్ముందు ఇంకా ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత ఫాస్ట్ అంటే.. కేవలం ఒక సెకెన్ లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని వెల్లడించింది. .గడిచిన కొంత కాలంగా అత్యంతం వేగంగా ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా Androidతో పని చేస్తున్న స్మార్ట్ ఫోన్లు శరవేగంగా ఛార్జ్ అవుతున్నాయి. ఛార్జింగ్ వేగం 120W నుంచి 150Wకు తాకాయి. Android స్మార్ట్ ఫోన్ల తయారీదారులు వేగవంతమైన ఛార్జింగ్ అందించడానికి నిరంతరం పోటీ పడుతున్నారు.
ఫాస్టెస్ట్ ఛార్జింగ్ మీద ఆసక్తి చూపని శామ్సంగ్, యాపిల్
అటు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న శామ్‌సంగ్, యాపిల్ కంపెనీలు మాత్రం సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వైపు అంతగా ఆసక్తి చూపించడం లేదు. వేగవంతమైన ఛార్జింగ్ మూలంగా దీర్ఘకాలంలో ఫోన్ బ్యాటరీకి హాని కలిగించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్.. ఫోన్ కు నిజంగా మంచిదేనా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు లేవు. కానీ.. చాలా మంది విశ్లేషకులు దీర్ఘకాలికంగా, బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుందని అంగీకరిస్తున్నారు.
ఒక్క సెకనులో ఫుల్ ఛార్జింగ్?
తాజాగా Oppo ఛార్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ హెడ్, ఎడ్వర్డ్ టియాన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ లలో పేలవమైన బ్యాటరీ లైఫ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫాస్ట్ ఛార్జింగ్ పెద్ద బ్యాటరీ పరిమాణాలకు దారి తీస్తుందన్నారు. ఎందుకంటే, వేగంగా ఛార్జ్ చేయడానికి.. ఎక్కువ C- రేటుతో బ్యాటరీ సెల్‌లను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఇది తక్కువ శక్తి సాంద్రతకు దారితీస్తుందన్నారు.
ఫాస్ట్ ఛార్జింగ్‌తో ముప్పు తప్పదా?
Oppo ఈ ఏడాది ప్రారంభంలో 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఆవిష్కరించింది. ఈ సాంకేతికతను OnePlus 10Tలో కూడా ఉపయోగించారు. ఈ పరికరాలు 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జ్ అవుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్లినట్లయితే కేవలం ఒక సెకనులో ఫోన్‌లు పూర్తిగా ఛార్జ్ చేయబడతాయని ఎడ్వర్డ్ టియాన్ తెలిపారు. అయితే ఇది అంత సులభం కాదన్నారు. టియాన్ చెప్పినట్లుగా, భద్రత, ఛార్జింగ్ ఉష్ణోగ్రత, బ్యాటరీ జీవితకాలం సహా పలు కీలక విషయాలు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ పై ఆధారపడి ఉంటాయి. తరచుగా ఫోన్ లను ఛార్జ్ చేసే వ్యక్తుల కోసం టియాన్ కొన్ని సలహాలను కూడా అందించాడు. మీ ఫోన్ 0% లేదా 100% దగ్గర ఎక్కువ సేపు ఉంచకూడదన్నారు. అలా చేయడం మూలంగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని వెల్లడించారు.