(Source: ECI/ABP News/ABP Majha)
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ నేడే - ఏం లాంచ్ కానున్నాయి? - ఎలా చూడవచ్చు?
యాపిల్ కొత్త ఈవెంట్ ఈరోజు జరగనుంది. ‘పీక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్’ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ఐఫోన్ ఎస్ఈ 3 5జీ, కొత్త ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
Apple Event 2022: యాపిల్ ‘పీక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్’ ఈరోజు అమెరికాలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ ఎస్ఈ 3 5జీ, కొత్త ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో, 7కే యాపిల్ స్టూడియో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎం2 సిలికాన్ చిప్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ కూడా ఇందులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్‌లో గ్రీన్ కలర్ వేరియంట్, ఐప్యాడ్ ఈ ఎయిర్‌లో పర్పుల్ కలర్ వేరియంట్ కూడా ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
యాపిల్ పీక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్: లైవ్ చూడటం ఎలా?
ఈ పీక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్ మార్చి 8వ తేదీన ఉదయం 10 గంటలకు (మనదేశ కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) జరగనుంది. యాపిల్ యూట్యూబ్ చానెల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్‌లో చూడవచ్చు. కింద ఉన్న లింక్ ద్వారా ఈ ఈవెంట్ చూడవచ్చు.
ఈ ఈవెంట్‌లో ఏం లాంచ్ కానున్నాయి?
యాపిల్ ఈవెంట్ గురించి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటోంది కొత్త ఐఫోన్ ఎస్ఈ గురించే. ఐఫోన్ ఎస్ఈ 3, ఐఫోన్ ఎస్ఈ (2022), ఐఫోన్ ఎస్ఈ+ 5జీ లేదా 5జీ ఐఫోన్ ఎస్ఈ పేర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 5జీ కనెక్టివిటీ ఉండనుంది. యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర 300 డాలర్లలోపే (సుమారు రూ.23,000) ఉండనుందని తెలుస్తోంది.
దీంతోపాటు యాపిల్ ఐదో తరం ఐప్యాడ్ ఎయిర్‌ను కూడా లాంచ్ చేయనుంది. కొత్త ఐప్యాడ్‌లో 5జీ కనెక్టివిటీ కూడా ఉండనుంది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌ను అందించే అవకాశం ఉంది. ఇందులో అప్‌డేట్ చేసిన 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది. యాపిల్ దీని ధరను 599 డాలర్లుగా (సుమారు రూ.46,000) నిర్ణయించే అవకాశం ఉంది.
యాపిల్ ఎం2, ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్, ఎం1 మ్యాక్స్ (సూపర్ పవర్డ్ వెర్షన్) ఉండే అవకాశం ఉంది. కొత్త మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్‌లు ఎం2 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్ వేరియంట్లతో ఐమ్యాక్ ప్రో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో రానున్న మ్యాక్ మినీలో ఎం2, ఎం1 ప్రో ప్రాసెసర్ ఆప్షన్లు ఉండనున్నాయి.
మ్యాక్ స్టూడియోను కూడా యాపిల్ ఈ ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీన్ని మొదట యూట్యూబర్ లూక్ మియనీ షేర్ చేశారు. దీని డిజైన్ గతంలో లాంచ్ అయిన మ్యాక్ మినీ తరహాలో ఉండనుంది. అయితే గతంలో లాంచ్ అయిన మ్యాక్ మినీ 1.4 అంగుళాల పొడవు ఉండగా... ఇది నాలుగు అంగుళాలు పొడవు ఉండనున్నట్లు తెలుస్తోంది.