Tokyo Olympics Medal Share: వీళ్లు నిజంగా బంగారు కొండలే..! టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం... మనసులు గెలుచుకున్న ఆటగాళ్లు
టోక్యో ఒలింపిక్స్ మొత్తానికి హైలైట్ అనదగ్గ సంఘటన ఇది..! ఒలంపిక్స్ అంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. అక్కడ పతకాన్ని చేజార్చుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ ఆ ఆటగాళ్లు మాత్రం స్వర్ణం పంచుకున్నారు.
విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడానికి ఆటగాళ్లు ఎంతో కష్టపడతారు. అలాంటిది బంగారు పతకాన్ని మరో ఆటగాడితో పంచుకోవడానికి ఒప్పుకోవడం అంటే కాస్త కష్టమే. కానీ, ఇలాంటి అరుదైన దృశ్యం టోక్యో ఒలింపిక్స్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే... జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరో 5 రోజుల్లో ఈ క్రీడలకు శుభం కార్డు పడనుంది. పోటీలు చివరి అంకాలకు చేరుకోవడంతో ప్రతి రోజూ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హై జంప్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఫైనల్స్‌లో ఖతార్‌కి చెందిన ముతజ్ బార్‌షిమ్, ఇటలీకి చెందిన టామ్‌బెర్ తంబేరి సంయుక్త విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాన్ని పంచుకున్నారు.
ఫైనల్ కోసం నిర్వహించిన పోటీల్లో వీరిద్దరూ సరిగ్గా 2.37మీటర్లు దూకారు. ఆ తర్వాత 2.39 మీటర్ల కోసం పోటీ జరపగా మూడు ప్రయత్నాల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. అప్పటికే మూడు గంటలకు పైగా పోటీలు జరిగాయి. విజేతను నిర్ణయించడానికి నిర్వాహకులు మరో రౌండ్ పోటీలు నిర్వహించాలని భావించారు.
ఈ క్రమంలో ఓ ఒలింపిక్ అధికారి ఇద్దరిలో ఒకరిని విజేతగా తేల్చడానికి మరొకసారి దూకుతారా అని ఆటగాళ్లను అడగ్గా.. దానికి వాళ్లు ఒప్పుకోలేదు. స్వర్ణాన్ని పంచుకునేందుకే ఇష్టపడ్డారు. ఈ సందర్భంగా బార్‌షిమ్ మాట్లాడుతూ... ‘తంబేరి నాకు మంచి ఫ్రెండ్. ట్రాక్‌లోనే కాదు బయటా అతడు నాకు మిత్రుడే. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ కూడా చేస్తాం. స్వర్ణం గెలవాలన్న మా కల నెరవేరింది. పసిడి పతకాన్ని షేర్ చేసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలనుకున్నాం. ఇప్పుడు అదే చేశాం’ అని చెప్పాడు.
ఆ తర్వాత తంబేరి మాట్లాడుతూ... ‘రియో ఒలింపిక్స్‌కి కొన్ని రోజుల ముందు గాయపడ్డాను. గాయాల నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలనుకున్నాను. ఇప్పుడు స్వర్ణం సాధించా. చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ మెడల్ షేరింగ్ సందర్భం ఆదివారం(ఆగస్టు 1న) చోటు చేసుకుంది. ఆ రోజే ఫ్రెండ్ షిప్ డే కావడం గమనార్హం. స్నేహితుల దినోత్సవం నాడు ఇలాంటి సందర్భంతో బార్‌షిమ్, తంబేరి తమ స్నేహానికి ఉన్న విలువ ఏంటో ప్రత్యక్షంగా తెలిపారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అధికారి వచ్చి అడగడం, వాళ్లు ఒప్పుకోకపోవడం, దీంతో ఆ అధికారి స్వర్ణాన్ని పంచుకోవాలని చెప్పడం, దానికి ఓకే చెప్పడం... దీంతో వాళ్లు సంబరాలు చేసుకోవడం ఈ వీడియోలో ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
The true essence of sportsmanship.
— Gavan Reilly is out of office (@gavreilly) August 1, 2021
🇮🇹 Gianmarco Tamberi and 🇶🇦 Mutaz Barshim are approached about a high-jump tiebreaker jump-off… and agree to share the Olympic title.#Athletics #Tokyo2020 pic.twitter.com/HyyJU0MtT3