Crime News: ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
Satyasai District: ప్రేమజంటకు సాయం చేసిందని ఆరోపిస్తూ ఓ మహిళపై బాలిక బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది.

Woman Attacked For Helping Lovers In Satyasai District: ఓ ప్రేమజంట పారిపోయేందుకు సాయం చేసిందని ఆరోపిస్తూ ఓ మహిళ పట్ల బాలిక బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించారు. ఈ దారుణ ఘటన సత్యసాయి జిల్లాలో (Satyasai District) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండ మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వారం కిందట వెళ్లిపోయింది. బాలిక తల్లిదండ్రులు ఈ నెల 13న కియా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు బాలిక ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే, ప్రేమజంటకు సాయం చేసిందనే కోపంతో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు బుధవారం దాడికి దిగారు. ఆమెను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు. తీవ్ర అవమానంతో వివాహిత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్థానికులు ఆమెను శాంతపరిచి పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులు, 11 మంది బంధువులపై కేసు నమోదు చేసినట్లు కియా స్టేషన్ ఎస్సై రాజేశ్ వివరించారు.



















