Highcourt Judges: తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు
Andhra News: తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది.
New Judges To AP And Telangana: తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఏపీకి (AP) ఇద్దరు, తెలంగాణకు (Telangana) నలుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఏపీలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందిస్తోన్న న్యాయాధికారి అవధానం హరిహరనాథశర్మ, హైకోర్డు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) పని చేస్తోన్న న్యాయాధికారి డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లు ఇందులో ఉన్నాయి.
వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేశాక ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతిని చేరతాయి. రాష్ట్రపతి ఆమోదిస్తే కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. మరో 7 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని కొలీజియం.. వీరిద్దరి పేర్లతో పాటు మరో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. సుప్రీం కొలీజియం నిర్ణయం తెలియాల్సి ఉంది.
హరిహరనాథ శర్మ - హరిహరనాథ శర్మ కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ చదివారు. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయసేవలందించారు. 2017 - 18లో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, 2020 - 22 విశాఖ పీడీజేగా పని చేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా.. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
డాక్టర్ లక్ష్మణరావు - డాక్టర్ లక్ష్మణరావు నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా తొలుత సేవలందించారు. తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలందించారు. నాగార్జున వర్శిటీ నుంచి పీజీ పూర్తి చేసి 2 మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఏయూ వర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2021లో హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. తర్వాత రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్నారు.
తెలంగాణ నుంచి నలుగురు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ.తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) బీఆర్ మధుసూదన్‌రావులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది.
Also Read: Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు