Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ సూపర్ ఫాం - ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియాకు వరం!
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫాంలో కనిపించాడు. ఇది వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియాకు వరం కానుంది.
Virat Kohli In IPL 2023: విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2023లో చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. అతని బ్యాట్ నుంచి రెండు సెంచరీలు కూడా వచ్చాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2022లో కోహ్లీ చాలా బ్యాడ్ ఫామ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో అతని ఫాం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్ ఇండియాకు ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించవచ్చు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ జూన్ 7వ తేదీ నుండి లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ కోహ్లి ఫామ్ టీమ్ ఇండియాకు బలం కాగలదు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విరాట్ కోహ్లీ రాణించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023లో కూడా కోహ్లీ అదే ఫామ్‌ను కొనసాగించాడు.
గత సీజన్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు పరుగులు
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మొదటి మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్‌తో ఆడింది. ఈ తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ అజేయంగా 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన అద్భుతమైన ఫామ్‌ను చూపించాడు. ఐపీఎల్ 2023లో 14 లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 53.25 సగటుతో 139.82 స్ట్రైక్ రేట్‌తో 639 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్ నుంచి రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు వచ్చాయి. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 101 నాటౌట్‌గా ఉంది.
ఐపీఎల్ 2022లో అంటే గత సీజన్‌లో అతను మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు, కేవలం 22.73 సగటుతో, 115.99 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 73 పరుగులు మాత్రమే.
2016 తర్వాత ఐపీఎల్ 2023నే అత్యుత్తమ సీజన్
విశేషమేమిటంటే ఐపీఎల్ 2023 విరాట్ కోహ్లీకి రెండో అత్యుత్తమ సీజన్. అతను IPL 2016లో అత్యధికంగా 973 పరుగులు చేశాడు. అతను ఈ సీజన్‌లో 639 పరుగులు చేశాడు. ఇది 2016 కాకుండా అత్యధికం. 2016లో అతను నాలుగు సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి మొత్తం 2 సెంచరీలు వచ్చాయి.
టన్నుల కొద్దీ పరుగులు చేయగలడు! పదుల కొద్దీ సెంచరీలు కొట్టగలడు! ఫీల్డర్ల మధ్యలోంచి అందమైన బౌండరీలు బాదగలడు! ప్రత్యర్థిని ఢీ అంటే ఢీ అంటూ బెదిరించగలడు! విజయం కోసం ఎంతకైనా తెగించగలడు! కానీ.. అసలు సిసలైన మ్యాచుల్లో జట్టును గెలిపించలేక ఇబ్బంది పడుతున్నాడు విరాట్ కోహ్లీ!
చివరి రెండు సీజన్లలో ఫామ్ కోల్పోయిన కింగ్ కోహ్లీ ఈసారి మాత్రం అదరగొట్టాడు. రెండు సెంచరీలు బాదేశాడు. స్ట్రైక్‌రేట్‌ను మరింత పెంచుకున్నాడు. ఎంతటి బౌలరైనా సరే సిక్సర్లు బాదేస్తున్నాడు. అలాంటింది గుజరాత్ టైటాన్స్‌పై ఓటమి తర్వాత అతడి కళ్లు చెమ్మగిల్లాయి.
భారీ స్కోరు చేయడం కోసం సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీలో మ్యాచ్ ఓడిపోతున్నామని తెలియగానే ఓ నిర్వేదం కనిపించింది. అతడిలోకి నిరుత్సాహం ఆవహించింది. గుండెల్లో కలుగుతున్న బాధను బయట పెట్టలేక.. దాన్ని అనుభవించలేక ఎంతగానో కుమిలిపోయాడు.
మనసులో బాధను అధిమిపట్టినా విరాట్ కోహ్లీ (Virat Kohli) బాడీ లాంగ్వేజ్‌లో అది ప్రస్ఫుటమైంది. కన్నీరు ఉబికి వచ్చింది. అందుకే ఆఖర్లో అతడు మైదానం వీడాడు. డగౌట్లో కూర్చొని కన్నీరు కార్చాడు. అతడి కంటి పొరలో నీటి చెమ్మ కనిపించగానే అభిమానులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.